Begin typing your search above and press return to search.

నగ్నంగా పరువు తీసిన ఎంపీకి భిన్నంగా వర్షంలో తడుస్తూ వైసీపీ ఎమ్మెల్యే సాయం

By:  Tupaki Desk   |   4 Aug 2022 9:39 AM GMT
నగ్నంగా పరువు తీసిన ఎంపీకి భిన్నంగా వర్షంలో తడుస్తూ వైసీపీ ఎమ్మెల్యే సాయం
X
వైరల్ వీడియోతో నోట మాట రాని రీతిలో చేసిన ఘనత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సొంతం. ఏమైందో కానీ తన నగ్నత్వాన్ని ప్రదర్శించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అదంతా కుట్ర అని ఆయన కొట్టి పారేస్తూ.. రాజకీయ ప్రత్యర్థుల పాడు పనిగా అభివర్ణించటం తెలిసిందే.

ఈ వీడియో ఉదంతంలో.. కరడు కట్టిన వైసీపీ నేతలు సైతం మాధవ్ పక్షాన నిలిచేందుకు జంకుతున్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన ఉదంతాల మాదిరి ఈ విషయంలో తొందరపడలేమని.. ఆచితూచి స్పందిస్తే మంచిదన్న మాట పలువురినోటి వినిపించటం గమనార్హం.

ఎంపీ గోరంట్ల మాధవ్ పుణ్యమా అని వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు.. అందరూ ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. ఇలాంటివేళలో.. బయటకు వచ్చిన మరో అంశం కొంతలో కొంత బాధ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందని చెప్పాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుసు కదా? తాజాగా ఆయన చేసిన పనికి అందరి చేత అభినందనలు పొందుతున్నారు.

వర్షంలో తడుస్తూ.. కష్టంలో ఉన్న వారికి సాయం చేసేందుకు సామాన్యుడిలా వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి చేత వావ్ అనేలా చేస్తోంది.నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి భారీగా నీళ్లు చేరాయి. ఒక పెళ్లికి హాజరయ్యేందుకు కారులో వెళుతున్న ఎమ్మెల్యే బ్రిడ్జి ముందు ఆగారు. కార్పొరేషన్ అధికారులకు చెప్పి మోటార్ల సాయంతో నీటిని తోడేయాలని కోరారు.

ఇదిలా ఉంటే.. నీళ్లు ఎక్కువగా ఉన్నా.. పెళ్లిళ్లకు వెళ్లాలన్న హడావుడిలో కార్లలో వెళుతున్న వాహనదారులు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. వర్షపు నీటి కారణంగా ఆగిన కారును బయటకు నెట్టే ప్రయత్నం చేశారు. కారు దిగిన ఎమ్మెల్యే.. వర్షంలో తడుస్తూ.. కారును ముందుకు నెట్టే ప్రయత్నం చేయటం.. ఎమ్మెల్యేనే నేరుగా రంగంలోకి దిగిన తర్వాత మిగిలిన వారు తలో చేయి వేయటంతో.. కారు కాస్తా క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది.

దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకేరోజు వెలుగు చూసిన వేర్వేరు ఉదంతాలు వైసీపీ నేతలకు చెందినవి కావటం.. రెండూ భిన్నమైన ఉదంతాలకు సంబంధించి కావటం ఆసక్తికరంగా మారింది.