Begin typing your search above and press return to search.

ఆ ఆడియోనే చిచ్చుపెట్టింది.. తాడిపత్రి రణరంగానికి కారణమదే?

By:  Tupaki Desk   |   24 Dec 2020 11:32 AM GMT
ఆ ఆడియోనే చిచ్చుపెట్టింది.. తాడిపత్రి రణరంగానికి కారణమదే?
X
అనంతపురంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులకు.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ గొడవకు సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారమే కారణమని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పెద్దారెడ్డి అనచరులు వాహనాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. అక్కడే ఉన్న కిరణ్ పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు భారీగా రాళ్లదాడి చేసుకున్నాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురి తలలు పగిలాయి.

ఈ వివాదానికి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోనే కారణంగా ప్రచారం సాగుతోంది. ఓ యువకుడు తనకు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించినట్టు తెలిసింది. వలీ అనే వ్యక్తి ఓ ఆడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో దుమారం రేపింది. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహించినట్టు సమాచారం.

ఈ ఆడియోలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య.. ఒక ఎడ్లబండి మట్టికి రూ.10వేలు వసూలు చేస్తున్నట్టు మాట్లాడుకున్నారు. ఇదే పెద్దారెడ్డి ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. అతడి కోసమే పెద్దారెడ్డి వర్గీయులు ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అక్కడ దొరికిన కిరణ్ అనే యువకుడిని చితకబాదినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడికి వెళ్లినప్పుడు ఇంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి లేనట్టు సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో పెద్దారెడ్డి కూర్చీని జేసీ అనుచరులు తగులబెట్టి హంగామా చేసినట్టు సమాచారం. దాడి నేపథ్యంలో జేసీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.