Begin typing your search above and press return to search.

ఈ వైసీపీ ఎమ్మెల్యే రూటే సెపరేటు!

By:  Tupaki Desk   |   29 Oct 2022 7:50 AM GMT
ఈ వైసీపీ ఎమ్మెల్యే రూటే సెపరేటు!
X
అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మొదటి నుంచీ తన రూటే సెపరేటు అన్నట్టుగా సాగుతున్నారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున మొదటిసారి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన ఆయన 2019లో ఘనవిజయం సాధించారు.

కాగా గెలిచిన దగ్గర నుంచి గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం పేరిట కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. ఉదయం లేవగానే ప్రతి వార్డులోనూ, గ్రామంలోనూ ఆయన నిర్వహించిన గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం కార్యక్రమం పార్టీలకతీతంగా అందరి ప్రశంసలు అందుకుంది. సోషల్‌ మీడియాలోనూ ఆయన కార్యక్రమాలు హల్‌చల్‌ చేశాయి. ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని నెటిజన్లు సైతం అభినందనలు కురిపించారు.

జగన్‌ ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టక చాలా కాలం ముందే వెంకట్రామిరెడ్డి గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం పేరిట నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారంటే అతిశయోక్తి కాదు.

కాగా తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ధర్మవరం ఐదో వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిర్వహించారు. ఆ కార్యక్రమం పూర్తవగానే తన టాప్‌లెస్‌ కారులో ఇంటికి వెళ్తుండగా ఆయనకు స్కూల్‌కు వెళ్తున్న పిల్లలు కనిపించారు. ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్‌ వద్ద ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి నడిచి వెళ్తున్న విద్యార్థినులను చూశారు.

దీంతో తన కారులో ఉన్న నేతలను కారు దింపేసి ఆ విద్యార్థినులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన కారులో ఎక్కించుకున్నారు. వారిని స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ స్కూల్‌ వద్ద వదిలివచ్చారు. దీంతో ఎమ్మెల్యే కారులో వచ్చిన విద్యార్థినులు ఎంతో సంబరపడిపోయారు.

మొత్తానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రచారం కోసం చేసినా.. లేదా మంచి పని కోసం విద్యార్థినులను ప్రోత్సహించడానికి చేసినా ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.