Begin typing your search above and press return to search.

వైసీపీలో అలజడి: ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి తీవ్ర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:18 PM GMT
వైసీపీలో అలజడి: ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి తీవ్ర వ్యాఖ్యలు
X
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై అదే పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. జిల్లాలోని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకాన పడింది. ఈ క్రమంలోనే కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎంపీ భరత్ వ్యవహారశైలిపై పదేళ్లకు పైగా పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

'తమ పార్టీలోని ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని' ఎంపీ భరత్ పేరు పలకకుండా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించడం అధికార పార్టీలో కలకలం రేపింది. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే రాజా నిప్పులు చెరిగారు.

'పార్టీకి నష్టం కలిగించిన వారిని.. కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని' జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎంపీ భరత్ రామ్ ను ఉద్దేశించి జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న సీతానగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పంెడ్ చేస్తే అతడికి వత్తాసు పలకడం సరికాదని ఎమ్మెల్యే జక్కంపూడి అన్నారు. పురుషోత్తమ పట్నం రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి పరిహారం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని జక్కంపూడి ఫైర్ అయ్యారు. సీబీఐ మాజీ జేడీతో భరత్ కు ఏం పని అంటూ ప్రశ్నించారు. ఆయనతో సెల్ఫీలు దిగుతారా? అంటూ నిలదీశారు. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారితో భరత్ కు ఏం పని అంటూ ఆగ్రహించారు. ఇలాంటి పిచ్చి చేష్టలతో పార్టీని నష్టం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.

నిజానికి మార్గాని భరత్ వైసీపీలోకి సార్వత్రిక ఎన్నికలకు 100 రోజుల ముందు మాత్రమే వచ్చి అనూహ్యంగా టికెట్ పొంది ఎంపీగా వైసీపీ ఊపులో గెలిచారు. అయితే జక్కంపూడి వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పాటుపడుతున్నారు. దీంతో సీనియర్ ను కాదని.. జూనియర్ ఎంపీ నియోజకవర్గంలో అన్ని విషయాల్లో వేలు పెట్టడంతోనే వీరి మధ్య విభేదాలు పొడచూపాయనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు అధికార వైసీపీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.