Begin typing your search above and press return to search.

ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి ఆగ్రహానికి కారణమేంటి?

By:  Tupaki Desk   |   21 Sep 2021 8:10 AM GMT
ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి ఆగ్రహానికి కారణమేంటి?
X
వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ భరత్ మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోంది. ఎంపీ భరత్ పై జక్కంపూడి రాజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వ నాశనం చేస్తున్నారని జక్కంపూడి ఆరోపించారు.

ముఖ్యంగా టీడీపీ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో భరత్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని జక్కంపూడి ఆరోపించడం సంచలనమైంది. సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టిన మాజీ ఐపీఎస్ అధికారిజేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకున్నారని ఆరోపించారు.

ఎంపీ భరత్ వెనుక రౌడీషీటర్లు, భూకబ్జాదారులు ఉన్నారని జక్కంపూడి ఆరోపించారు. భారత్ చిల్లర పనులు మానుకోవాలని జక్కంపూడి హెచ్చరించారు. భారత్ తన నియోజకవర్గమైన రాజానగరంలో దళితులు, గిరిజనులు, బీసీలను రెచ్చగొడుతున్నారని జక్కంపూడి ఆరోపించాడు. తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి తూచ్ అంటున్నాడని మండిపడ్డారు.

ఇక తన తమ్ముడు గణేష్ ప్రజా సేవ అంటూ ప్రజల్లోకి వెళ్లి పేదలకు చాలా పంచుతున్నాడని.. అప్పులు చేసి మరీ వాడు చేసిన ఖర్చులను తాము తీరుస్తున్నామని.. ఎవరి నుంచి రూపాయి ఆశించకుండా ప్రజాసేవలో పాటుపడుతున్నామని జక్కంపూడి అన్నారు. తాము ఎవరిని బెదిరించో బతిమాలో చేయడం లేదని.. ప్రజలపై ఉన్న ప్రేమ, అభిమానాలతోనే చేస్తున్నామన్నారు.

‘పార్టీకి నష్టం కలిగించిన వారిని.. కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని’ జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎంపీ భరత్ రామ్ ను ఉద్దేశించి జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న సీతానగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పంెడ్ చేస్తే అతడికి వత్తాసు పలకడం సరికాదని ఎమ్మెల్యే జక్కంపూడి అన్నారు. పురుషోత్తమ పట్నం రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి పరిహారం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు.

నిజానికి మార్గాని భరత్ వైసీపీలోకి సార్వత్రిక ఎన్నికలకు 100 రోజుల ముందు మాత్రమే వచ్చి అనూహ్యంగా టికెట్ పొంది ఎంపీగా వైసీపీ ఊపులో గెలిచారు. అయితే జక్కంపూడి వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పాటుపడుతున్నారు. దీంతో సీనియర్ ను కాదని.. జూనియర్ ఎంపీ నియోజకవర్గంలో అన్ని విషయాల్లో వేలు పెట్టడంతోనే వీరి మధ్య విభేదాలు పొడచూపాయనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు అధికార వైసీపీలో కలకలం రేపుతున్నాయి.