Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు స‌న్మానం చేస్తా...జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   19 Jun 2019 10:46 AM GMT
కేసీఆర్‌ కు స‌న్మానం చేస్తా...జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం
X
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి గ‌త కొంత‌కాలంగా అనూహ్య‌మైన కామెంట్ల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీఆర్ ఎస్ పార్టీని ఎండ‌గ‌ట్ట‌డం ద్వారా మీడియాలో నిలిచిన జ‌గ్గారెడ్డి తాజాగా...ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌ పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఈ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్న జ‌గ్గారెడ్డి...తాజాగా ఏకంగా సీఎం కేసీఆర్‌ కు స‌న్మానం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, దాని ద్వారా నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో జ‌గ్గారెడ్డి ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

హైదరాబాద్ గాంధీభ‌వ‌న్‌ లో నిర్వ‌హించిన మీడియా ఇష్టాగోష్టిలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి స్పందిస్తూ...కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ``కాళేశ్వరం పూర్తి అయితే నా నియోజకవర్గంలో నీ సింగూరు, మంజీర ప్రాజెక్టుకు నీళ్ళు వస్తాయి. మా సంగారెడ్డికి ఉపయోగపడే అత్యంత పురాతన మహబూబ్ సాగర్‌ కు నీళ్ళు వస్తాయి. వీటి ద్వారా మా సంగారెడ్డి ప్రజల సాగు , త్రాగునీటి సమస్య తీరుతుంది. మంచి పని ఎవరు తలపెట్టిన సమర్థించాలి. ప్రాజెక్ట్, డ్యాంలు రైతులు, ప్రజల కోసం ఎవరు కట్టినా మంచిదే. తెలంగాణ రాష్ట్రంలో తొలి డ్యాం నాగార్జున సాగర్ నెహ్రూ సార‌థ్యంలో కాంగ్రెస్ సీఎంలు పూర్తి చేశారు. శ్రీశైలం కూడా ఇందిరా ప్రధానిగా కాంగ్రెస్ సీఎంలు ఉన్నప్పుడే పూర్తి చేశారు. మా సింగూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మించారు. ప్రాజెక్టుల‌ను నాడు కాంగ్రెస్ సీఎంలు కట్టినా నేడు సీఎం కేసీఆర్ కట్టినా అన్ని తెలంగాణ ప్రజలకోసమే అని భావించాలి. వాటిని రాజకీయం చేయొద్దు`` అని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

యూపీఏ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఏర్పాటు చేయటం వల్లే కేసీఆర్ సీఎం అయ్యి కాళేశ్వరం కడుతున్నాడని, ఆ ప్రాజెక్టులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందని జగ్గారెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. ``*కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయిన ఏడాదిలో సింగూరు, మంజీర, మ‌హ‌బూబ్‌ సాగ‌ర్ ప్రాజెక్టుల‌ను నీళ్ళతో నింపితే మా సంగారెడ్డి రైతులు, ప్రజల పక్షాన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఘనంగా సన్మానం చేస్తాం.`` అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి తాను మాట్లాడన‌ని పేర్కొన్న జ‌గ్గారెడ్డి ఆ ప‌ని సీఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క‌ చూసుకుంటారని ప్ర‌క‌టించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఏపీ సీఎం జగన్మోహ‌న్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ వచ్చినా తప్పులేదని జ‌గ్గారెడ్డి అన్నారు.