Begin typing your search above and press return to search.

గువ్వల.. మరీ ఈ రచ్చ ఏంది?

By:  Tupaki Desk   |   25 April 2021 10:30 AM GMT
గువ్వల.. మరీ ఈ రచ్చ ఏంది?
X
రాజకీయాల్లో ఒప్పులు చేయకున్నా ఫర్లేదు తప్పులు మాత్రం చేయకూడదు. అదే సమయంలో అహంభావం అస్సలు పనికిరాదు. మనసులో ఎంత ఉన్నా సరే.. మాటల్లోనూ.. ప్రజల ఎదుట మాత్రం అస్సలు ప్రదర్శించకూడదు. అయితే.. ఇలాంటి చేయకూడని తప్పుల్ని చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు అచ్చంపేట ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు.

మహబూబ్ నగర్ జిల్లాలోని అధికార పక్ష నేతల్లో బాలరాజు పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. మంచి వాగ్దాటి.. అంతకు మించిన ఆవేశాన్ని ప్రదర్శించే ఆయన పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. తాజాగా జరుగుతున్న అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు బాలరాజును దెబ్బ తీయటమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ కు ఏ మాత్రం మేలు చేయమన్న మాట వినిపిస్తోంది.

తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ ఛుగ్ ప్రచారసభను అచ్చంపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న వేళ.. అదే రోడ్డు మీదకు ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో వచ్చారు. రోడ్డు మీద వెళుతున్న తమ వాహనానికి అడ్డుగా ఉన్నారంటూ.. రోడ్ షో జరుగుతున్న వేళ.. నిలుచున్న బీజేపీ కార్యకర్తల్ని పక్కకు తోసేశారు. దీంతో.. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఈ ఉదంతంలో బీజేపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ తప్పు లేకుండానే పోలీసులు తమపై లాఠీ ఛార్జి చేశారని మండిపడుతున్నారు. ఈ మొత్తం ఉదంతానికి కారణమైన బాలరాజు తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీలో ఉన్నప్పుడు ఒదిగి ఉండాల్సిందిపోయి.. ప్రజల ఎదుట ఆయన ప్రదర్శించిన అధికార బలం విమర్శలకు తెర తీస్తోంది. ఈ తరహా ఉదంతాలతో ప్రజల మనసుల్ని గెలుచోలేరని చెబుతున్నారు. ఇలాంటివి ఇమేజ్ పెంచే కన్నా.. డ్యామేజ్ చేస్తాయని.. తీరు మార్చుకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది. అధికారంలో ఉండి మాంచి జోరు మీద ఉన్న బాలరాజుకు ఇలాంటి మాటలు వినిపిస్తాయా?