Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని.. మళ్లీ సౌండ్ చేస్తున్నారే... ?

By:  Tupaki Desk   |   15 Dec 2021 1:30 PM GMT
విశాఖ రాజధాని.. మళ్లీ సౌండ్ చేస్తున్నారే... ?
X
రాజకీయాల్లో కాదేదీ అనర్హం అన్నట్లుగా హామీలు కూడా మారుతున్నాయి. అంతే కాదు, డైవర్షన్ పాలిటిక్స్ ని కూడా ఇపుడు నేతలు అలవాటు చేసుకున్నారు. ఒక అంశం మీద సీరియస్ గా డిస్కషన్ సాగుతూంటే అది తమకు ఇబ్బందిగా మారుతుంది అని గ్రహించిన నేతలు దాన్ని తిప్పి పక్కన పెట్టేందుకు వేరే విధమైన అంశాన్ని ముందుకు తెస్తున్నారు. ఇపుడు ఏపీలో మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదేనా అన్న చర్చ అయితే సాగుతోంది.

అమరావతి రాజధాని ఉండగా మూడు రాజధానులు తెచ్చారు. పోనీ దాన్ని అయినా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. కోర్టు కేసులు ఉన్నాయి అని రెండేళ్ళ పాటు చూసి తీరా విచారణ దశలోనే తామే తెచ్చిన చట్టాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో మూడు రాజధానుల సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే ఉత్తరాంధ్రాలో, రాయలసీమలో కొన్ని వర్గాల ప్రజలలో ఆశలను రేకెత్తించిన పాపం మాత్రం సర్కార్ పెద్దలదే అన్న కామెంట్స్ ఉన్నాయి.

ఇపుడు విశాఖ రాజధాని విషయమే తీసుకుంటే వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఆ సమస్య మీద కూడా ఎవరూ మాట్లాడలేదు, అయితే మూడు రాజధానుల పేరుతో విశాఖ సహా ఉత్తరాంధ్రాలో రాజకీయంగా బలపడడానికి వైసీపీ వేసిన పాచిక అని అర్ధం చేసుకున్న విపక్షాలు దానిని మించిన బ్రహ్మాస్త్రం తమ వద్ద ఉందని కౌంటర్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు.

వారికి విశాఖ స్టీల్ ప్లాంట్ అంది వచ్చిన అస్త్రమే అయింది. దీనిమీద రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఎంత వుంది అన్నది పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీకి కొంత బాధ్యత ఉంది. తాము ఎంతో చేశాం, కేంద్రం మీద వత్తిడి పెట్టామని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అంటే అనవచ్చు గాక కానీ అఖిల పక్షం వేయడం కానీ, మరింత గట్టిగా వత్తిడి తీసుకురావడం కానీ చేయ‌లేదు అన్న విమర్శలు విపక్షాల వైపే కాదు జనం నుంచి కూడా వస్తున్నాయి.

దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి అర్జంట్ గా మరోమారు విశాఖ రాజధానిని ముందుకు తెచ్చారు అంటున్నారు. వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ విశాఖ రాజధాని అంశాన్ని ముందు పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ మీద కౌంటర్లు వేస్తున్నారు.

విశాఖ సహా ఉత్తరాంధ్రాకు ద్రోహం చేసి రాజధానిని వ్యతిరేకించిన పవన్ ఇపుడు స్టీల్ ప్లాంట్ మీద మొసలి న్నీళ్ళు కార్చడం అంటే అంతా రాజకీయమే అంటూ గుడివాడ గట్టిగా చెబుతున్నారు. ఆరు నూరు అయినా విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన బల్ల గుద్దుతున్నారు.

అంతే కాదు, విశాఖ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్న పవన్ని ఇపుడు విశాఖ రాజధానికి అనుకూలమా కాదా అని చెప్పమంటున్నారు గుడివాడ. ఆ విధంగా ఆయన్ని టార్గెట్ చేయడానికి రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారు అని కామెంట్స్ పడుతున్నాయి.

నిజానికి ప్రభుత్వానికి మూడు రాజధానుల మీద ఉన్న చిత్త శుద్ధి ఎంత, నిజంగా ప్రభుత్వం రాజధానిని చెప్పిన మూడు చోట్ల ఏర్పాటు చేయగలదా అంటే దానికి సమాధానం అయితే ఈ రోజుకీ లేదు. కానీ రాజధాని పేరిట జనాలను మభ్యపెడుతున్నారని విపక్షాలు గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి.

మొత్తానికి మూడు రాజధానుల చట్టం రద్దుతో అంతా అయిపోయింది అనుకుంటున్న వేళ మళ్ళీ గుడివాడ హడావుడి చేస్తున్నారు. మరి ఇది నిజంగా జరిగే పనేనా లేక రాజకీయ ఆయుధంగా మార్చుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికి సమాధానం ఇప్పటికి, ఈ రోజుకీ మాత్రం దొరకదు అంతే.