Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే డాక్ట‌ర్‌.. పొలిటిక‌ల్ నాడి ప‌ట్టుకోలేక‌పోతున్నారే!

By:  Tupaki Desk   |   28 March 2022 2:46 AM GMT
ఎమ్మెల్యే డాక్ట‌ర్‌.. పొలిటిక‌ల్ నాడి ప‌ట్టుకోలేక‌పోతున్నారే!
X
ఆయన సైలెంట్ నాయ‌కుడు. పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో అయితే.. స్వ‌యంగా ఆయ‌న పాద‌యాత్ర కూడా చేసి.. పార్టీని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారు. వ‌రుస‌గా విజ‌యాలు కూడా సాధిస్తున్నారు. పైగా ఉన్నత విద్యా వంతుడు. వివాదాల‌కు దూరంగా ఉంటున్నారు. ప్ర‌జ‌ల సేవ‌లో ఆయ‌న‌నిత్యం బిజీగా ఉంటున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. ఆయ‌న‌కు పెద్ద‌గా గుర్తింపు లేదు. కానీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాత్రం ఆయ‌న‌కు మంచి మార్కులే ఉన్నాయి. నిజానికి ఎవ‌రు త‌న‌వ‌ద్ద‌కు వెళ్లినా.. లేచి నిల‌బ‌డే ఛాన్స్ జ‌గ‌న్ ఇవ్వ‌రు.

కానీ.. ఈయ‌న‌మాత్రం వెళితే.. జ‌గ‌న్ లేచి నిల‌బ‌డి షేక్ హ్యాండిచ్చి.. బాగోగులు తెలుసుకుంటారు. క‌లిసి కాఫీ కూడా తాగుతారు. పార్టీ విష‌యాలు కూడా చ‌ర్చిస్తారు. నిజానికి సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు చాలా మందికి అప్పాయింట్‌మెంట్లు కావాలి. కానీ,, ఈయ‌న‌కు మాత్రం అవ‌స‌రం లేద‌ట‌. అరుదుగా జ‌గ‌న్‌ను క‌లిసినా.. ఎలాంటి అప్పాయింట్‌మెంట్ లేకుండా.. నేరుగా ఆయ‌న‌ను క‌లుసుకుంటు ఉంటారు. ఆయ‌నే గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈయ‌న అజాత శ‌త్రువుగా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకున్నా.. పొలిటిక‌ల్‌గా ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ నాడిని తెలుసుకోలేక పోతున్నారే వాద‌న వినిపిస్తోంది. పైగా రెడ్డి ట్యాగ్ కూడా ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింద‌నే వాద‌న ఉంది.

ఇప్ప‌టికి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. పేద‌ల‌కు ఉచితంగా వైద్యం కూడా చేస్తుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈయ‌న‌కు గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే.. ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌విపై ఆశ ఉంది. ముఖ్యంగా ఈయ‌న కంటే.. కూడా నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లే ఈయ‌న‌ను మంత్రిగా చూడాల‌ని అనుకుంటున్నారు. నిజానికి 2019లోనూ గుంటూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఎవ‌రికీ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఎంద‌రో ప్ర‌య‌త్నించినా.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మేక‌తోటి సుచ‌రిత‌కు అనూహ్యంగా హోం శాఖ ప‌గ్గాలు అప్ప‌గించారు. త‌ర్వాత‌.. మోపిదేవివెంక‌ట ర‌మ‌ణ‌ను ఓడిపోయినా.. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు.

అయితే.. త‌ర్వాత ఆయ‌న‌ను బీసీ కోటాలో రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇక‌, అప్ప‌టి నుంచి సుచ‌రిత ఒక్క‌రే గుంటూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఇస్తే బాగుంటుంద‌ని.. త‌ద్వారా.. టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌లో ఇక , ఆపార్టీకి స్థానం లేకుండా చేయొచ్చ‌ని.. డాక్ట‌ర్ ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇప్ప‌టికి.. దీనిపై ఆయ‌న రెండు సార్లు జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. కానీ, ఎప్పుడు క‌లిసినా.. ఈ విష‌యం త‌ప్ప‌.. అన్ని విష‌యాలు మాట్లాడుతున్నార‌ట‌. దీనికి ఆయ‌న మొహ‌మాట‌మే.. ఆయ‌న‌కు శ‌త్రువుగా మారుతోంద‌ని.. అంటున్నారు ఆయ‌న అనుచ‌రుల్లోని కీల‌క నాయ‌కులు. మ‌రి జ‌గ‌న్ ఆయ‌న మ‌న‌సులో మాట‌ను గ్ర‌హిస్తారా? లేదా? చూడాలి. ఏదేమైనా ప్ర‌జ‌ల నాడి ప‌ట్టినంత‌గా.. జ‌గ‌న్ నాడి ప‌ట్టుకోలేక పోతున్నార‌నే వాదన వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.