Begin typing your search above and press return to search.

బాబూరావే అక్కడ బాహుబలి...?

By:  Tupaki Desk   |   17 March 2022 4:30 PM GMT
బాబూరావే అక్కడ బాహుబలి...?
X
టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా పాతిన మొనగాడు విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన 2009లో వైఎస్సార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఫస్ట్ టైమ్ లోనే ఆయన నాటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుని 650 ఓట్లతో ఓడించారు. 2012లో వైసీపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసి 13 వేల పై చిలుకు మెజారిటీ సాధించారు. 2014లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన బాబూరావు 2019లో మళ్లీ పాయకరావుపేట నుంచే బరిలోకి దిగి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను 33 వేల ఓట్ల తేడాతో ఓడించి బాహుబలి అనిపించారు.

ఇక ఆయనకు మంత్రి పదవి ఖాయం అనుకుంటున్న నేపధ్యంలో పాయకరావుపేటలో కొందరు నాయకులు అసమ్మతి జెండా ఎత్తారు. దాంతో అది పొలిటికల్ గా కొంత ఇబ్బందిగా ఉన్నా హై కమాండ్ ని కలసి బాబూరావు మొత్తం పరిస్థితి వివరించారని అనుచరులు చెబుతున్నారు. ఇక ఆయన అంటే జగన్ కి ప్రత్యేక అభిమానం ఉందని, ఇక గొల్ల బాబూరావే ఎప్పటికీ కూడా పేటకు మేస్త్రీ అని అంటున్నారు

పార్టీలో ఎమ్మెల్యేకు ఎదురు నిలిచిన వారికి ప్రజా బలం లేదని కూడా అంటున్నారు. ఇక అధినాయకత్వం కూడా తనకున్న సమాచారం మేరకు చూస్తే బాబూరావుని పక్కన పెడితే ఇబ్బందే అని గ్రహించిందని అంటున్నారు. ఇక బాబూరావు మంత్రి వర్గం రేసులో ఉన్నారన్న తాజా వార్తలు కూడా ఇపుడు ఆయన వర్గాన్ని ఖుషీ చేస్తున్నారు.

ఎస్సీ కోటాలో అనకాపల్లి జిల్లా నుంచి బాబురావుకు చాన్స్ దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపధ్యం, సీనియారిటీ, విధేయత వంటివి ఆయన్ని కుర్చీ ఎక్కిస్తాయని అంటున్నారు. ఇదిలా ఉండగా బాబూరావుకు ఒకవేళ మంత్రి పదవి ఏ కారణం చేత అయినా ఇవ్వలేకపోతే అనకాపల్లి జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా చేస్తారని కూడా చెబుతున్నారు.

మొత్తానికి అటువైపు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను వచ్చే ఎన్నికల్లో ఓడించాలి అంటే బాబూరావుని మించిన ఆప్షన్ వైసీపీకి లేదని అంటున్నారు. ఇక పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన ట్రాక్ రికార్డు ఉందని, పైగా ఆయన దూకుడు గతం కంటే తగ్గిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బాబూరావుకు మంచి రోజులు వచ్చాయని ఆయన వర్గం అయితే హుషార్ చేస్తోంది.