Begin typing your search above and press return to search.

జగన్ బ్యాచ్ కి గిరిజనం ఇచ్చిన షాక్

By:  Tupaki Desk   |   10 Nov 2015 4:23 AM GMT
జగన్ బ్యాచ్ కి గిరిజనం ఇచ్చిన షాక్
X
అధికారపక్షం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు ఆందోళన చేయటం.. ప్రజల మద్దతు కూడగట్టుకోవటం మామూలే. అలాంటి పనే చేయబోయి అడ్డంగా ఇరుక్కోవటం విశేషం. ఏ గిరిజనం తరఫున పోరాడేందుకు వెళ్లారో.. వారే అడ్డుకోవటం గమనార్హం. అయితే.. తాము చేయనున్న ఆందోళనపై సరైన వ్యూహం లేకపోవటం జగన్ బ్యాచ్ వైఫల్యంగా చెప్పొచ్చు. అదే సమయంలో తాము ఏ అంశం మీద ఆందోళన చేయాలని భావిస్తున్నారో.. అదే అంశానికి అనుకూలంగా సదరు పార్టీ వ్యవహరించటం కూడా ఈ చేదు అనుభవానికి ఒక కారణంగా చెప్పొచ్చు.

విశాఖ ఏజెన్సీ పరిధిలోని బాక్సైట్ తవ్వకాల్ని అడ్డుకునేందుకు.. అక్కడి గిరిజనుల తరఫున తాము పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నేతలు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. తమ ఆందోళనకు సంబంధించిన సమాచారం గిరిజనులకు చేరవేయటంలో జరిగిన లోపంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై గిరిజనం అగ్రహం వ్యక్తం చేయటం.. వారికి సర్ది చెప్పి.. తాము వచ్చింది గిరిజనుల తరఫున పోరాడేందుకే అన్న విషయాన్ని స్పష్టం చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. అదే సమయంలో.. స్థానిక గిరిజనులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించేందుకు పాడేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈశ్వరి.. జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నేతలు విశాఖ ఏజెన్సీలోని జర్రెలకు వచ్చాయి. బాక్సైట్ తవ్వకాల అనుమతిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. వైఎస్సార్ నేతలు గిరిజనులకు సమాచారం అందించారు. జర్రెంకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు.. తామున్నప్రాంతానికి గిరిజనం వచ్చాక వారితో కలిసి జర్రెంకు వెళ్లాలని భావించారు. అయితే.. వైఎస్సార్ నేతలు వచ్చింది బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అయితే.. గిరిజనులు మాత్రం బాక్సైట్ తవ్వకాల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వచ్చారని భావించి సంప్రదాయ ఆయుధాలు చేతబట్టి.. నాయకుల్ని నిలదీశారు.

తాము వచ్చింది ఒకదానికైతే.. విషయం మరోలా టర్న్ తీసుకుందన్న విషయం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. అయితే.. ఇక్కడ గిరిజనుల్ని తప్పు పట్టటానికి కూడా లేదు. ఎందుకంటే.. వారు తెరపైకి తీసుకొచ్చిన అంశం అలాంటిది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన అన్ రాక్ కంపెనీకి సంబంధించి.. పెన్సా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి జగన్ మేనమామ వరస అవుతారని.. బాక్సైట్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోరాడాలంటే.. ముందు కంపెనీనిని మూసేసిన తర్వాత రావాలంటూ నిలదీయటంతోవైఎస్సార్ కాంగ్రెస్ నేతల నోట మాట రాని పరిస్థితి.

అదే సమయంలో.. తమ అనుమతి లేకుండా బాక్సైట్ కొండను ఎలా ఎక్కుతారని గద్దించటం.. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇచ్చే సమాదానం వారిని సంతృప్తి పర్చలేకపోయింది. ముందు తమతో పాటు జర్రెం వరకూ నడవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్ని కొండగుట్టల్లో 5 కిలోమీటర్ల మేర నడిపించారు. దీంతో.. వారిని నెమ్మదిగా సమాధానపరిచి తాము వచ్చింది గిరిజనులకు అండగా నిలిచేందుకు అని చెప్పినా వారు నమ్మని పరిస్థితి. బాక్సైట్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చామని చెబితే.. పెన్నా ప్రతాపరెడ్డి పేరును తీసుకొచ్చి దాని సంగతేం చేస్తారని అడగటంతో వారికేం సమాధానం చెప్పాలో పాలు పోని పరిస్థితి.

ఇక.. కొండల్లో నడుచుకుంటూ జర్రెం చేరుకున్న తర్వాత కోండ్రుపల్లికి వచ్చిన సభ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు వారిని ఒప్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తల ప్రాణం తోకకు వచ్చిన పరిస్థితి. ఏదో చేయటానికి వెళితే.. ఇంకేదో అయ్యిందన్నట్లుగా జగన్ బ్యాచ్ కి చిత్రమైన అనుభవం ఎదురైంది. ఒక విధంగా ఈ పరిణామం ఏపీ అధికారపక్షానికి ఒక హెచ్చరిక లాంటిది. మరి.. బాక్సైట్ తవ్వకాలపై బాబు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.