Begin typing your search above and press return to search.

గంటా సంచలనం: విశాఖ ఉక్కుపై రాజీనామాలే చివరి అస్త్రాలు..

By:  Tupaki Desk   |   9 March 2021 8:30 AM GMT
గంటా సంచలనం: విశాఖ ఉక్కుపై రాజీనామాలే చివరి అస్త్రాలు..
X
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తేల్చేసిందని.. ఇక ప్రైవేటు పరం కాకతప్పదని.. పార్టీలు పక్కనపెట్టి అందరం రాజీనామా చేద్దామని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చాడు. వైసీపీ నేతలు రాజీనామా చేయాలని వారిపై టీడీపీ పోటీ పెట్టదని ప్రతిపాదన చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించాలని.. ప్లాంట్ పరిరక్షణ కోసం ముందుకు రావాలని కోరారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని గంటా వ్యాఖ్యానించారు. కొంత మంది బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గంటా తెలిపారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వందశాతం అయిపోయిందన్నారు. అదో ముగిసిన అధ్యాయం అన్నారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఖచ్చితంగా నా రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని గంటా స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రాజీనామాలు చేయాలని.. అదే చివరి అస్త్రం అన్నారు. ఇప్పుడైనా వైసీపీ నేతలు ముందుకు రావాలని కోరారు.

అధికార పార్టీ ఒక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్లాలన్న గంటా.. అధికార పార్టీతో తోడుగా పోరాటం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్లదని బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.