Begin typing your search above and press return to search.

అక్కడ సైకిల్ గణగణ మోగేనా... ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 3:30 AM GMT
అక్కడ సైకిల్ గణగణ మోగేనా... ?
X
అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడని ఒక ముతక సామెత ఉంది. టీడీపీలో కూడా ఇపుడు అలాంటి వాతావరణమే కనిపిస్తోందా అన్న మాట ఉంది. పార్టీ పెద్దలు హడావుడి పడినా కూడా తమ్ముళ్ళు ఎవరూ ఉలకరు పలకరు, అధినాయకత్వం మాత్రం జోరు చేయమంటోంది. కానీ హుషారు తెచ్చుకుని ఫీల్డ్ లోకి దూకే వారు అయితే ఎవరూ కనిపించడంలేదు. ఈ నేపధ్యంలో వరసబెట్టి సమీక్షలు సమావేశాలు పెట్టి మరీ చంద్రబాబు పార్టీ గేర్ మారుస్తున్నారు.

అలా ఈ మధ్య విశాఖ జిల్లాకు చెందిన కీలక నేతలను, ఎమ్మెల్యేలను పిలిచి మరీ దూకుడు పెంచమన్నారు. ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వరసగా రెండు సార్లు గెలిచిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలమంతా చడీ చప్పుడూ చేయడంలేదని ప్రచారంలో ఉంది. ఆయన ఎందుకో సైలెంట్ గా ఉంటున్నారు అని కూడా అంతా అనుకుంటున్నారు.

మరి చంద్రబాబు పిలుపు మేరకు గణబాబు స్పీడ్ పెంచుతారా అన్నదే చర్చగా ఉంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన గణబాబుకు పశ్చిమలో మంచి పట్టుంది. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయనది రాజకీయ కుటుంబం, తండ్రి పెతకంశెట్టి అప్పలనర హం కూడా టీడీపీలో ఎంపీగా చేసిన సీనియర్ నేత.

అయితే ఆయనలో అసంతృప్తి ఉందని అంటున్నారు. గతంలో మంత్రి పదవిని ఆశించిన గణబాబుకు అది అందని పండు అయింది. ఇక పార్టీలో కూడా కొన్ని విషయాల్లో గ్యాప్ ఉందని అంటున్నారు. దాంతోనే ఆయన తగ్గారని అంటున్నారు. ఈ మధ్యనే తన తండ్రి పెతకంశెట్టి జయంతి వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన గణబాబు అలా చాలాకాలానికి జనాల్లోకి వచ్చారు.

ఈ కార్యక్రమాలకు టీడీపీ సీనియర్ నేతలు కూడా రావడం విశేషం. ఈ విధంగా తాను పార్టీ మారడంలేదని, టీడీపీలోనే ఉన్నాను అన్న సంకేతాలను బలంగానే పంపగలిగారు కానీ ఇపుడున్న పరిస్థ్తితుల్లో గణబాబు గొంతు విప్పాల్సి ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్నికలు కూడా రెండేళ్ళలో జరగనున్నాయి. పార్టీని ఇప్పటి నుంచే పటిష్టం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని అంటున్నారు.

గణబాబు మనసులో ఏముందో తెలియదు కానీ మునుపటి దూకుడు అయితే కనిపించడం లేదని అంటున్నారు. అయితే ఆయన సరైన టైమ్ చూసి రంగంలోకి వస్తారని అనుచరులు అంటున్నారు. మొత్తానికి టీడీపీ అధినాయకత్వం సమీక్షల వల్ల ఏదైనా కదలిక పార్టీలో వచ్చిందా అన్న‌దే చూడాలి.