Begin typing your search above and press return to search.

టీడీపీలో ఆ ఎమ్మెల్యేకి సెగ‌.. ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   5 Nov 2020 8:10 AM GMT
టీడీపీలో ఆ ఎమ్మెల్యేకి సెగ‌.. ఏం జ‌రుగుతోందంటే!
X
టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలే త‌క్కువ‌గా ఉన్నారు. ఉన్న‌వారిలోనూ కొంద‌రు ఇప్ప‌టికే అధికార పార్టీవైపు చూస్తున్నారు. కొంద‌రు వెళ్లిపోయారు. ఇక‌, కొంద‌రు ఎమ్మెల్యేలు.. మాత్రం చంద్ర‌బాబు వెంటే ఉండిపోయే వారు ఉన్నారు. వారిలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గ‌ద్దె రామ్మోహ‌న్‌. సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన గ‌ద్దె.. అన్న‌గారి హ‌యాం నుంచి కూడా టీడీపీలో చ‌క్రం తిప్పుతున్నారు. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 2014లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన గ‌ద్దె.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని గెలుపు గుర్రం ఎక్కారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, అస‌లు క‌ష్టాలు ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచే వ‌స్తున్నాయ‌ని గ‌ద్దె అనుచ‌రులు చెబుతున్నారు. విజ‌య‌వాడలో టీడీపీ గ్రూపు రాజ‌కీయాల‌కు కేంద్రంగా మారిపోయింద ని.. ఎవ‌రికి వారు.. గ్రూపులుగా మారి రాజ‌కీయాలు చేసుకుంటుండ‌డంతో కొంద‌రు గ‌ద్దెను దూరం పెడు తున్నారని అంటున్నారు. ఇక‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ద్దె అంటే గిట్ట‌ని టీడీపీ స్థానిక మాజీ కార్పొరే ట‌ర్లు.. లోక‌ల్ లీడ‌ర్లు.. ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అదేస‌మ‌యంలో స్థానిక వైసీపీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్, యువ నేత‌.. దేవినేని నెహ్రూ వార‌సుడు.. దేవినేని అవినాష్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ముందుగా అవినాష్‌కు స‌మాచారం ఇస్తున్నారట కొంద‌రు.దీంతో అవినాష్ త‌న వ‌ర్గాన్ని వెంటేసుకుని స‌ద‌రు స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, ఇంత‌టితో ఆగ‌ని.. గ‌ద్దె వ్య‌తిరేక వ‌ర్గం.. స‌ద‌రు స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయిన త‌ర్వాత‌.. విష‌యాన్ని ఆయ‌న దృష్టి కి తీసుకువెళ్తున్నారు. దీంతో నా నియోజ‌క‌వ‌ర్గంలో నాకు తెలియ కుండానే వ్య‌వ‌హారాలు ఎలా న‌డిపిస్తార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఎవ‌రు? అని అవినాష్‌పై ఇటీవ‌ల గ‌ద్దె రామ్మోహ‌న్ ఒకింత ఫైర్ అయ్యారు.

స్థానిక ప‌త్రిక‌ల్లో పెద్ద ఎత్తునే ఈ విష‌యం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే.. ఇలా గ‌ద్దె అభాసు పాల‌వ‌డం వెనుక టీడీపీలోని ఓ వ‌ర్గం ప్ర‌ధానంగా చ‌క్రం తిప్పుతోంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. సౌమ్యుడు, వివాద ర‌హితుడే అయినా.. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌గా ఉన్న ఆయ‌న స‌తీమ‌ణి గ‌ద్దె అనురాధ‌ను.. విజ‌య‌వాడ న‌గ‌ర కార్పొరేష‌న్‌.. మేయ‌ర్ ప‌ద‌వికి దింపాల‌ని భావించిన నాటి నుంచి గ‌ద్దెకు పార్టీలోని కొంద‌రితో పొస‌గ‌డం లేదు. దీంతో ఇప్పుడు ఈ వివాద‌మే చిలికి చిలికి.. ఆయ‌న‌ను అభాసుపాల్జేసేలా మారింద‌ని అంటున్నారు. మ‌రి గ‌ద్దె ఈ చెవిలో జోరీగ‌ల‌ను ఎలా త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారో చూడాలి.