Begin typing your search above and press return to search.

వివాదాల గ‌ని... చింతమనేని !

By:  Tupaki Desk   |   18 Dec 2018 9:55 AM GMT
వివాదాల గ‌ని... చింతమనేని !
X
చింతమనేని ప్రభాకర్ - ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్యే - వివాదాలకు మారుపేరు. కొంద‌రు ఆయ‌న్ను ఇసుక మాఫియా కింగ్ అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అండదండలున్న ఎమ్మెల్యే. తనకు ఎవ్వరు ఎదురు చెప్పినా కూడా వాళ్ల అంతు చూస్తానంటూ బెదిరించడం ఈయనకు పరిపాటే. పైగా నేను ఇంతే... మా బాస్‌కు నేను చెప్పుకుంటాను అని కూడా అనేశాడు. అందుకేనేమో చింత‌మనేని ఎన్ని తప్పులు చేసినా, ఎలా ప్రవర్తించినా కూడా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు మందలించినట్టు కాని, కనీసం పిలిచి మాట్లడినట్లు గాని దాఖలాలు లేవు. దీంతో ఆయ‌న‌ చేష్టలకు, ప్రవర్తనుకు అడ్డు, అదపు లేకుండా పోతోంది. ఆ మధ్య ఇసుక అక్రమ రవాణకు సంబంధించి ఏకంగా ఒక తసీల్దారు తన విధుల్లో భాగంగా ట్రాక్ట‌ర్ల‌ను అడ్డుకుంటే ఆమెను బెదిరించారు. ప‌క్క‌కు లాగేశారు. అప్ప‌ట్లో అది సంచ‌ల‌నం అయ్యింది. అప్ప‌ట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పు చేసిన తన పార్టీ ఎమ్యెల్యేను మందలించలేదు సరికదా... ఆ మహిళా తాసీల్దారును అనవసర విషయాలలో జోక్యం చేసుకోనవద్దంటూ మందలించటం విశేషం.

పై సంఘటన తర్వాత చింతమనేని ఇంకా రెచ్చిపోయారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తన వెనక ఉంటే తనకు అడ్డేమిటి అనుకున్నారేమో, ఏదో ఒక వివాదంలో తన ప్రతాపాన్ని, అధికారాన్ని సామాన్యులపై చూపిస్తూనే ఉన్నారు. తాజాగా చింతమనేని మరో కొత్త వివాదానికి తెర తీసారు. మంగళగిరి వద్ద టోల్‌ గేట్‌ సిబ్బందిని నానా దుర్భాషలాడారు. నెంబరు ప్లేట్‌ కాని - ఎమ్మెల్యే పాస్ లేకుండా టోల్‌ గేట్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించారు చింతమనేని. ఈ నేపథ్యంలో టోల్‌గేట్ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని.. నా కారునే ఆపుతారా అంటూ టోల్‌గేట్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. కారును వీఐపీ వాహనాలు వెళ్లే దారిలో వదిలి వేసి బస్సులో వెళ్లిపోయారట‌. టోల్ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు.

నియమ నిబంధనలు సామాన్యులకే కాని, రాజకీయ నాయకులకు వర్తించవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చింతమనేని ప్రవర్తన పై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం నంబర్ ప్లేట్ కాని కారు పాస్‌ కాని లేకుండా ఆయన రాష్ట్రంలో తిరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన చింతమనేని నలుగురికి ఆదర్శంగా ఉండాలి గాని ఆయనే తప్పు చేస్తే ఎలా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.