Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు చిన్నారెడ్డి పంచ్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   20 Jun 2019 11:27 AM GMT
కేసీఆర్ కు చిన్నారెడ్డి పంచ్ మామూలుగా లేదుగా!
X
కొన్నిసార్లు అంతే. పెద్ద‌గా తిట్ట‌క్కేర్లేదు.. మాట‌లు కూడా అన‌క్క‌ర్లేదు. గురి చూసి విడిచిన బాణంలా ఉండే మాట‌లు చాలు అధికారంలో ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేయ‌టానికి. తాజాగా అలాంటి ప‌రిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఎదుర‌య్యేలా చేశారు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి. మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు భిన్నంగా నెమ్మ‌దిగా ఉండే ఆయ‌న నోటి నుంచి ఏదైనా మాట వ‌స్తే దాని వ్య‌వ‌హార‌మే వేరుగా ఉంటుంది.

తాజాగా త‌న తీరుకు త‌గ్గ‌ట్లే మాట్లాడి మ‌రోసారి తానేమిటో అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేశారు చిన్నారెడ్డి. ప్రాజెక్టుల‌కు తాను వ్య‌తిరేకం కాద‌ని.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ కూడా వ్య‌తిరేకం కాద‌న్నారు. ప్రాజెక్టుల్లోచోటు చేసుకునే అవినీతికే తాము వ్య‌తిరేక‌మ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రారంభోత్స‌వానికి మాజీ మంత్రి హ‌రీశ్ రావును కూడా పిల‌వాల‌ని వ్యాఖ్యానించారు. తామే క‌ష్ట‌ప‌డిన‌ట్లుగా తండ్రి..కొడుకులు గొప్ప‌లు చెప్పుకోవ‌టం కాద‌ని.. ఈ ప్రాజెక్టు కోసం మొద‌ట్నించి క‌ష్ట‌ప‌డిన హ‌రీశ్ ను కూడా పిల‌వాల‌ని చిన్నారెడ్డి వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్లాన్ కేసీఆర్ దే అయిన‌ప్ప‌టికీ.. రికార్డు స‌మ‌యంలో ప్రాజెక్టు పూర్తి అయ్యిందంటే అదంతా హ‌రీశ్ క‌ష్టం.. స్వేద‌మ‌న్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే.. రెండోసారి అధికారంలోకి వ‌చ్చినంత‌నే ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న హ‌రీశ్ కు ప‌ద‌విని ఇవ్వ‌ని కేసీఆర్‌.. ఆ శాఖ‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నారు. తాజాగా కాళేశ్వ‌రం మీద అదే ప‌నిగా మాట్లాడుతున్న కేసీఆర్‌.. ఒక్క సంద‌ర్భంలో కాకున్నా.. ఒక్క సంద‌ర్భంలోనూ హ‌రీశ్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌టం లేదు. దీనిపై హ‌రీశ్ వ‌ర్గం కుత‌కుత‌లాడిపోతోంది. అలా అని అధినేత‌ను ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. గులాబీ బ్యాచ్ ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చిన్నారెడ్డి హ‌రీశ్ ప్ర‌స్తావ‌న తేవ‌ట‌మేకాదు.. ప్రాజెక్టు ఓపెనింగ్‌కు ఆయ‌న్ను ఆహ్వానించ‌మ‌నే వ‌ర‌కూ వెళ్ల‌టం గులాబీ బాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. తాము ప‌క్క‌న పెట్టేసిన హ‌రీశ్ గురించి.. ఆయ‌న ప‌డిన క‌ష్టం గురించి కాంగ్రెస్ నేత‌లు మాట్లాడ‌టం గులాబీ బ్యాచ్ కు తెగ ఇబ్బంది క‌ల‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.