Begin typing your search above and press return to search.

ఏహోదా లేని ఎమ్మెల్యే సోదరుడు సమీక్షనా?

By:  Tupaki Desk   |   31 March 2021 8:30 AM GMT
ఏహోదా లేని ఎమ్మెల్యే సోదరుడు సమీక్షనా?
X
సాధారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్షలు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎమ్మెల్యే సోదరుడు ఆ పాత్రలోకి ప్రవేశించాడట.. ఈ మేరకు అన్నీ తానై అధికారులు, సిబ్బందితో ఏకంగా సమీక్ష నిర్వహించినట్టు అనంతపురంలో కోడై కూస్తున్నారు. ఈ మేరకు మీడియాలో కూడా వార్తలు రావడంతో ఇదో పెద్ద దుమారం రేపింది.

తాజాగా కార్యాలయ తలుపులు మూసేసి.. సమావేశం నిర్వహించాడట ఎమ్మెల్యే సోదరుడు. అదీ అత్యంత రహస్యంగానట.. పార్టీ నాయకులు, కార్యకర్తల మాట వినని.. తమకు అనుకూలంగా లేని అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోవాలంటూ అధికారులకే హుకూం జారీ చేశాడట.. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆనోటా ఈనోటా మీడియాకు ఎక్కి రచ్చ జరుగుతోంది.

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానై నిర్వహిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనగాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి హోదా లేకపోయినా ఎమ్మెల్యే తమ్ముడిగా ఆయన శాఖల వారీగా సమీక్ష నిర్వహించడం.. దానికి అధికారులు, సిబ్బంది హాజరు కావడం దుమారం రేపింది.

పైగా మీటింగ్ లో తాము చెప్పినట్లు చేయలేని వారు సెలవులు పెట్టి వెళ్లిపోవాల్సిందేనంటూ ఆయన అధికారులపై చిందులు తొక్కినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ప్రజలు సైతం ఈ మీటింగ్ అయ్యేంత వేచి ఉండడం.. ఎమ్మెల్యే తమ్ముడి వ్యవహారం చూసి నాయకులు సైతం తప్పుపట్టినట్టు తెలిసింది. ఏ హోదాతో ఆయన ఈ మీటింగ్ నిర్వహించాడని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే కానీ.. ఆయన తమ్ముడు కానీ స్పందించాల్సి ఉంది.