Begin typing your search above and press return to search.

బాబూమోహన్ లంచం... టీఆరెస్

By:  Tupaki Desk   |   17 July 2015 8:38 AM GMT
బాబూమోహన్ లంచం... టీఆరెస్
X
ఓటకు నోటు కేసుతో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఇబ్బందులు పెట్టబోయిన టీఆరెస్ పార్టీ కూడా ఇప్పుడు లంచం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే బాబూమోహన్ నెలకు రూ.50 వేలు లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఇది బాబూమోహన్ పై వచ్చిన ఆరోపణగా మాత్రమే కాకుండా ఏకంగా టీఆరెస్ నే ఇబ్బంది పెట్టేలా టర్న్ తీసకుంటోంది.

మెదక్ జిల్లా సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టియు ఇంజనీరింగ్ కాలేజీ మెస్ కాంట్రాక్టర్‌ నుంచి బాబూమోహన్ నెలకు రూ.50 వేలు లంచంగా స్వీకరిస్తున్నారట... ఈ విషయం స్వయంగా ఆ కాంట్రాక్టరే వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తూ ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్టు సమాచారం. మెస్‌లో అందించే ఆహారం నాణ్యత లోపించిందంటూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తక్షణం మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్ నోరు విప్పి అసలు విషయం చెప్పేశాడు. ఆంధోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు నెలకు రూ.50 వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నానని... ఈ సమయంలో ఇంతకంటే మంచి భోజనం ఎలా పెట్టగలనని ప్రశ్నించాడు.. దీంతో టీఆరెస్ ఎమ్మెల్యే బాబూమోహన్ వ్యవహారం బయటపడింది.

కాగా తనపై వచ్చిన ఆరోపణలపై బాబూ మోహన్ స్పందించారు. ఈ వ్యవహరంపై కాలేజీ ప్రిన్సిపాల్ ఎలాంటి విచారణనైనా జరిపించుకోవచ్చన్నారు. మెస్ నిర్వహణ సక్రమంగా లేకపోతే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆయన ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. తాను ఎవరి వద్ద కూడా డబ్బులు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.. అయితే... మెదక్ జిల్లా టీడీపీ శ్రేణులు మాత్రం టీఆరెస్ లంచగొండి పార్టీ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నాయి.. ఎమ్మెల్యేలు లంచాలు తీసుకోవడం వల్లే విద్యార్థులు నాణ్యత లేని భోజనం తినాల్సివస్తోందని మండిపడుతున్నారు.