Begin typing your search above and press return to search.

మాజీ మంత్రిని భయపెడుతున్న భీమిలీ

By:  Tupaki Desk   |   2 Oct 2022 5:08 AM GMT
మాజీ మంత్రిని భయపెడుతున్న భీమిలీ
X
విశాఖ జిల్లాలో భీమునిపట్నానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందమైన ఊరే కాదు రాజకీయంగా కూడా పేరు ఉన్న ప్రాంతమిది. ప్రశాంతత‌కు మారుపేరుగా ఉన్న భీమిలీ తెలుగుదేశం పార్టీ రానంతవరకూ కాంగ్రెస్ కి పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. ఎపుడైతే 1982లో టీడీపీ వచ్చిందో నాటి నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అలా వరసగా అయిదు సార్లు టీడీపీ భీమిలీలో గెలిచిన తరువాత 2004లో తొలిసారి ఆ కోటను కాంగ్రెస్ బద్ధలు కొట్టింది. వైఎస్సార్ వేవ్ లో అది సాధ్యపడింది.

ఇక 2009 నాటికి ప్రజరాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ భీమిలీలో ఎమ్మెల్యే అయ్యారు. 2014 నాటికి తిరిగి టీడీపీ ఆ సీటుని కైవశం చేసుకుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీలో దిగడం వల్ల భీమిలీ టీడీపీదే అన్న మాటను దక్కించుకుంది. అయితే 2019 నాటికి సీన్ మారింది. అవంతి శ్రీనివాసరావు వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపు పదివేల ఓట్ల తేడాతో గెలిచారు. ఆ మీదట మంత్రి కూడా అయ్యారు.

అంటే గత ఇరవయ్యేళ్ళుగా చూసుకుంటే టీడీపీ గెలిచింది ఒకే ఒక్కసారి అన్న మాట. అయినా సరే భీమిలీలో టీడీపీ బలం ఏ మాత్రం తగ్గడంలేదు. పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. అలాగే చిత్తశుద్ధితో పనిచేసే క్యాడర్ ఆ పార్టీ సొంతం. అలా ఎపుడు ఎన్నికలు జరిగినా భీమిలీలో టీడీపీ జెండా ఎగరవేయాలని తమ్ముళ్ళు పట్టుదలగా ఉన్నారు. నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న కోరాడ రాజబాబు బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు.

ఈసారి ఆయనకే టికెట్ అని పార్టీ వర్గాలు అంటున్నారు. గతంలో టీడీపీ తరఫున ఎంపీపీగా పనిచేసిన రాజబాబుకు అంగ బలం, అర్ధం బలం రెండూ ఉన్నాయి. దాంతో పాటు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానానలు గెలుచుకుని వైసీపీని వెనక్కి నెట్టింది. ఇక భీమిలీ సీటు ఈసారి టీడీపీదే అని అంతా అంటున్న నేపధ్యం ఉంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాసరావు మంత్రిగా మూడేళ్ళ పాటు ఉన్నా కూడా భీమిలీకి ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నది అతి పెద్ద ఆరోపణ. అదే సమయంలో ఆయన క్యాడర్ కి ప్రజలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారని అంటున్నారు. దాంతో పాటు వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత పెరగడం కూడా మాజీ మంత్రికి కొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. ఆయన గడప గడపకు కర్యక్రమానికి వెళ్తే మాకేమి చేశారు, మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనాలు ఎదురుగానే నిలదీసి అడుగుతున్న పరిస్థితి.

ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా వచ్చిన అనేక సర్వేలలో భీమిలీలో వైసీపీ బాగా వెనకబడిందన్న నిజాన్నే చెబుతున్నాయట. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీ అధినాయకత్వం మాజీ మంత్రిని గట్టిగా పనిచేయమని సూచనలు చేస్తూ వస్తోంది అని అంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భీమిలీలో వైసీపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోగా టీడీపీ సమరోత్సాహంతో ఉంది. ఇక జనసేన కూడా ఇక్కడ బలంగా ఉంది.

ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే వైసీపీ దారుణంగా దెబ్బతింటుందని కూడా లెక్కలు ఉన్నాయి. దాంతో మాజీ మంత్రి అవంతి ఈసారి పోటీ చేయడానికి ఏ కారణాన అయినా సందేహిస్తున్నారా అన్న చర్చ కూడా కొత్తగా మొదలైంది. ఆయన ఈసారికి తాను పోటీ చేయనని తన బదులుగా తన కుమారుడు శివనందేష్ కి టికెట్ ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరినట్లుగా వార్తలు అయితే వచ్చాయి.

అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని అవంతి వారసుడి చేతిలో భీమిలీని పెట్టడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.ఎన్నికలు ఆరు నెలల ముందే టికెట్లు ప్రకటిస్తామని జగన్ చెబుతున్నారు. దాంతో ఈలోగా పరిస్థితిని మెరుగుపరచుకోకపోతే అవంతిని పక్కన పెట్టి కొత్తవారికి భీమిలీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు అని అంటున్నారు. ఈ రకమైన చర్చలు, ఆలోచనలతో భీమిలీ మాజీ మంత్రిని పూర్తిగా భయపెడుతోంది అని అంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి మరోసారి మంత్రిని కూడా చేసిన భీమిలీ ఈసారి అవంతిని భయపెట్టేలా ఎందుకు మారింది అన్నది ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలని సొంత పార్టీలో కూడా వినిపిస్తున్న మాట.