Begin typing your search above and press return to search.

జగన్ సర్కారు ఇమేజ్ కు డ్యామేజ్ గా ఎమ్మెల్యే అన్నా రాంబాబు యవ్వారాలు!

By:  Tupaki Desk   |   23 Jan 2021 8:00 AM GMT
జగన్ సర్కారు ఇమేజ్ కు డ్యామేజ్ గా ఎమ్మెల్యే అన్నా రాంబాబు యవ్వారాలు!
X
సమస్యల్ని ప్రశ్నించటం సామాన్యుడి హక్కు. ఓట్లు కోసం వచ్చినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేనికైనా సిద్ధమని చెప్పే నేతలు.. అదే ప్రజలు వేసిన ఓట్లతో గెలిచినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి బరితెగింపునకు పాల్పడటం ఏ మాత్రం మంచిది కాదు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఓపక్క అలుపెరగని రీతిలో ప్రజల కోసం.. వారి సమస్యల పరిష్కారం కోసం వేలాది కోట్ల రూపాయిల్ని ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుకు భిన్నంగా.. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరు ఉండటం గమనార్హం. గ్రామ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని ప్రశ్నించారన్నకోపంతో ఒక యువకుడి ప్రాణాలు పోవటానికి కారణమైన తీరును పలువురు తప్పు పడుతున్నారు.

ఏపీ అధికారపార్టీలో ఈ తరహా ఎమ్మెల్యేల కారణంగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. బెదిరింపులకు పాల్పడటం.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం లాంటి వాటికి దూరంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఏపీ ప్రభుత్వానిి తలనొప్పిగా మారింది. ఈ తరహా ఎమ్మెల్యేలు ఏపీ వ్యాప్తంగా పది మంది వరకు ఉన్నారని.. అలాంటి వారి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శ వినిపిస్తోంది.

సమస్యల్ని ఎత్తి చూపించిన యువకుడ్ని సావధానంగా స్పందిస్తూ.. వెంటనే పరిష్కరిస్తామని మాట చెబితే.. ప్రశ్నించిన యువకుడు వేరే పార్టీ అయినప్పటికీ.. ప్రజల కోణంలో చూసినప్పుడు ఎమ్మెల్యే పక్షానే ఉంటారు. అందుకు భిన్నంగా నువ్వు నన్నే ప్రశ్నిస్తావా? అంటూ గద్దించటం.. నన్ను అడిగేప్పుటు వేరే పార్టీ కండువా మెళ్లో వేసుకొని నా ముందుకు వస్తావా? అంటూ రెచ్చిపోయి బూతులు తిట్టిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

అంతేకాదు.. రాయలేని రీతిలో బూతులు తిట్టటం.. నువ్వెవుడి రా నాకు చెప్పటానికి అంటూ మాట్లాడిన మాటలు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఇలాంటి ఎమ్మెల్యేల తీరును పార్టీ అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తూ.. వారికి తగిన రీతిలో కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.