Begin typing your search above and press return to search.

త‌మిళుల‌పై స్టాలిన్ పేల్చిన షాకింగ్‌ జోక్

By:  Tupaki Desk   |   8 Feb 2017 8:57 AM GMT
త‌మిళుల‌పై స్టాలిన్ పేల్చిన షాకింగ్‌ జోక్
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అనూహ్య‌మైన కామెంట్ చేశారు. తిరుచ్చిలో జ‌రిగిన ఓ వివాహంలో పాల్గొన్న ఆయన.. పెళ్లి కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే...ప్రపంచంలోనే ఒక ఓటుకు ముగ్గురు ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించడం తమిళనాడులో మాత్రమే జరిగిందని ఎద్దేవా చేశారు. అనంత‌రం ఓ పిట్టకథ చెప్పారు. ‘ఒక ఊరిలో ఓ ఏరు ఉండేది. పక్కనే ఉన్న గ్రామస్థులు.. ఏటి పక్కనున్న పెద్ద చెట్టు ద్వారా దాటేవారు. ఓ అయిదారేళ్ల తర్వాత ఆ ప్రాంతమంతా ఎడారిలా మారింది. దీంతో ప్రజలు ఆ ఏటిలో దిగి మరో గట్టుకు చేరుకునేవారు. కానీ ఉన్నట్టుండి.. ఆ ఏట్లో భారీస్థాయిలో నీళ్లు ప్రవహించాయి. దీంతో ఆ మహావృక్షం కూడా ఎటుపోయిందో తెలియక రహస్యంగా మిగిలింది. దీంతో ఆ ఏటిని ఎలా దాటాలో తెలియక గ్రామస్థులు ఆలోచనలో పడ్డారు. దీంతో పక్కనే కనిపించిన ఓ ‘చిన్న..’ దుంగ సాయంతో దాటాలని దానిపై ఎక్కారు. సగం దూరం వెళ్లాకే తెలిసింది... అది మెసలి అని! దీంతో ఆ ప్రజలు కాపాడండీ అంటూ కేకలు పెట్టారు. దీంతో గట్టుపై ఉన్న ప్రజలు.. ‘మిమ్మల్ని కాపాడేందుకు ఓ పడవ తీసుకొస్తాం. అప్పటి వరకు మీరు ప్రాణాలతో ఉండండి’ అని చెప్పారు. దీన్ని ప్రస్తుత రాజకీయాలకు అన్వయించి... నన్ను సమస్యలోకి నెట్టకండి’ అంటూ స్టాలిన్‌ తప్పించుకున్నారు.

ఇదిలాఉండ‌గా... ప్రధానమంత్రి నరేంద్రమోదీని డీఎంకే నేతలు బుధవారం ఢిల్లీలో కలవనున్నారు. ఆపార్టీ నేత స్టాలిన్ నేతృత్వంలో నేతలు కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గంటకో విధంగా మార్పులు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే... మంగళవారం రాత్రి 9గంటల సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు ప్రకటించారు. దీంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారా... లేదా... అన్న విషయం సందిగ్ధంలో పడింది. కాగా... శశికళను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న డీఎంకే నేతలు ఆమె ప్రమాణస్వీకారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతోపాటు పలువురు కలవనున్నట్లు సమాచారం. ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే నేతలు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/