Begin typing your search above and press return to search.

ఎయిరిండియా అధికారిని కొట్టిన ఎంపీ అతడే

By:  Tupaki Desk   |   28 Nov 2015 12:11 PM IST
ఎయిరిండియా అధికారిని కొట్టిన ఎంపీ అతడే
X
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్ మీద జగన్ ఎంపీ ఒకరు చేయి చేసుకున్న విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిబంధనల్ని గాలికి వదిలి.. చట్ట విరుద్ధంగా చేయి చేసుకున్న జగన్ బ్యాచ్ ఎంపీ ఎవరన్నది తాజాగా బయటకు వచ్చింది. ప్రోటోకాల్ పాటించటం లేదంటూ ఎయిరిండియా మేనేజర్ పై దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇరు వర్గాల మధ్య రాజీ జరిగిందన్న మాట వినిపించింది. దీంతో.. సదరు అధికారిని కొట్టిన ఎంపీ ఎవరన్నది బయటకు రాలేదు.

తాజాగా అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై పోలీసులకు తాజాగా ఒక ఫిర్యాదు అందింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులకు ఎయిరిండియా మేనేజర్ ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీడ్కోలు పలికేందుకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన జగన్ పార్టీ నేతలు.. ప్రోటోకాల్ పాటించలేదంటూ తమపై దాడికి పాల్పడ్డారంటూ.. ఎంపీ మిధున్ రెడ్డి.. మరో 15 మంది జగన్ పార్టీకి చెందిన నేతలపై పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం బాధ్యతలు నిర్వర్తించకపోతే.. చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా ప్రయత్నించాలే కానీ.. ఇలా భౌతికదాడులకు పాల్పడటం ఏమిటన్న విమర్శ వ్యక్తమవుతోంది.