Begin typing your search above and press return to search.

మన మిథాలీకే ప్రపంచ కప్ పగ్గాలు.. దాయాదితో తొలి పోరు

By:  Tupaki Desk   |   6 Jan 2022 10:30 AM GMT
మన మిథాలీకే ప్రపంచ కప్ పగ్గాలు.. దాయాదితో తొలి పోరు
X
దిగ్గజ బ్యాటర్.. హైదరాబాదీ క్రికెటర్ మిథాలీరాజ్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత జట్టును నడిపించనున్నారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను మార్చి 6వ తేదీన ఓవల్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో తలపడబోతోంది. మార్చి 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్, 16న ఇంగ్లాండ్, 19న ఆస్ట్రేలియా, 22న బంగ్లాదేశ్, 27న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇవన్నీ గ్రూప్ దశ మ్యాచ్ లు. మిగతా గ్రూప్ లలో ఆయా జట్లు నిలిచిన స్థానాలను బట్టి భారత్ తదుపరి ప్రత్యర్థులెవరో తెలుస్తుంది. కాగా, ఇటీవలి టి20 ప్రపంచ కప్ లో పురుషుల జట్టు, అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత జట్లు తమ తొలి మ్యాచ్ లను పాకిస్థాన్ తోనే ఆడడం విశేషం.

మరోవైపు ప్రపంచ కప్ 2022తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న, వన్డే సిరీస్‌తో పాటు ఏకైక టీ20కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఏకైక టీ20నే జరుగనుది. మిథాలీ టి20లకు రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రెండేళ్లుగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏకైక టి20కి కూడా ఆమెనే సారథిగా ప్రకటించారు. అయితే కొన్నాళ్లుగా హర్మన్ ఫామ్ లో లేదు. పూర్తిగా విఫలమవుతున్నప్పటికీ ఆమెపై భరోసా ఉంచారు. స్మృతి మంధాన ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు.

మిథాలీకి ఇదే ఆఖరు..
220 వన్డేలు.. 199 ఇన్నింగ్సులు.. 7,391 పరుగుల.. 51 సగటు.. ఏడు సెంచరీలు, 59 అర్ధ శతకాలు.. వన్డే క్రికెట్ లో మరెవరికీ సాధ్యం రికార్డులు మిథాలీ సొంతం. అప్పడు ఇప్పడు కాదు.. ఆమె అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమై రెండు దశాబ్దాలు దాటిపోయింది. 12 టెస్టులు, 89 టి20 ల్లోనూ ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లోనే మిథాలీ ప్రపంచ మహిళా క్రికెట్ లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచారు. 2017లోనే వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరారు.

ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్ లోనే ఆమె ఈ రికార్డును అందుకున్నారు. వాస్తవానికి ఈ టోర్నీలో మిథాలీ 3 అర్ద శతకాలు, ఓ శతకంతో కలిపి మొత్తం 409 పరుగులు చేశారు. మన జట్టు ఫైనల్ చేరడంలో మిథాలీదే కీలక పాత్ర. అయితే, తర్వాతి ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో మిథాలీకి చేదు అనుభవం ఎదురైంది.

హర్మన్ సారథ్యంలో ఆ టోర్నీ ఆడిన భారత జట్టు మిథాలీని సెమీస్ లో పక్కనపెట్టింది. అప్పటి కోచ్ రమేశ్ పొవార్ తో పాటు హర్మన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మిథాలీ లేఖ విడుదల చేసి సంచలనం రేపారు. తర్వాత వివాదం సద్డుమణిగినా.. మిథాలీ టి20 లకు వీడ్కోలు పలికారు. ఇక రెండు నెలల్లో జరుగబోయే వన్డే ప్రపంచ కప్ తో మిథాలీ అంతర్జాతీయ కెరీర్ కూ వీడ్కోలు చెప్పే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఆమె నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

కప్ సాధిస్తే ఘన వీడ్కోలు
భారత జట్టు వన్డే వరల్డ్ కప్ సాధిస్తే 39 ఏళ్ల మిథాలీ కి అది ఘన వీడ్కోలు అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 11 వన్డే ప్రపంచ కప్ లు జరిగితే భారత్ ఒక్కసారీ విజేతగా నిలవలేదు. ఆరుసార్లు ఆస్ట్రేలియా, నాలుగుసార్లు ఇంగ్లండ్, ఒకసారి న్యూజిలాండ్ ఒకసారి గెలిచాయి. 2005, 2017లో మన జట్టు రన్నరప్ నిలిచింది. ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే, మిథాలీకి తోడు ఈసారి కుర్ర షెఫాలీ, స్మృతి మంధాన వంటి బ్యాటర్లు తోడైతే ఈసారి కప్ కొట్టే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా షెఫాలీ.. లేడీ సెహ్వాగే.. మరి లేడీ సచిన్ మిథాలీకి ఆమె ప్రపంచకప్ ను బహుమతి గా ఇస్తుందా? లేదా? చూద్దాం?

మహిళల ప్రపంచకప్‌కు భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ పేర్లను ప్రకటించారు.. ఇక, స్టాండ్ బై ప్లేయర్స్గా సబ్బినేని మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్ న్యూజిలాండ్ తో టి20 కి భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి, యాస్తిక, దీప్తి, రిచా(వికెట్‌ కీపర్‌), స్నేహ రాణా, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి, పూనమ్, ఏక్తా, ఎస్‌. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్