Begin typing your search above and press return to search.

మా స‌క్కెస్‌ ను మ‌గాళ్లు స‌హించ‌లేరు!

By:  Tupaki Desk   |   2 Oct 2017 10:34 AM GMT
మా స‌క్కెస్‌ ను మ‌గాళ్లు స‌హించ‌లేరు!
X
మ‌హిళా క్రికెట్‌లో ప్ర‌పంచంలోనే మేటి క్రీడాకారిణిగా రికార్డుల‌కు ఎక్కిన టీమిండియా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్, మ‌న తెలుగు అమ్మాయి మిథాలీ రాజ్‌... ఏ విష‌యాన్నైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేయ‌డంలో ఘ‌నాపాఠేన‌ని చెప్పాలి. క్రికెట్ అంటే మ‌గాళ్లు మాత్ర‌మే ఆడే క్రీడ‌గానే మొన్న‌టిదాకా మ‌న‌కు తెలుసు. అయితే మిథాలీ లాంటి డేరింగ్ లేడీస్ ఈ క్రీడ ప‌ట్ల ఆస‌క్తి చూప‌డం, త‌ద‌నంత‌ర కాలంలో జాతీయ స్థాయితో పాటు అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సాధించ‌డం మిథాలీ లాంటి కొద్ది మంది వ‌ల్ల మాత్ర‌మే అయ్యింది. అయినా ఇప్పుడు లేడీస్ క్రికెట్ టోర్న‌మెంట్లేమీ లేవు క‌దా... మిథాలీ గురించి ఇంత‌గా చెప్పేస్తున్నారేమిటా? అని ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే... ఇప్పుడు కేవలం మ్యాచ్‌ లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మాత్ర‌మే మాట్లాడుకునే వ్య‌క్తి స్థాయిని మిథాలీ ఎప్పుడో దాటేశారు.

వ‌ర‌ల్డ్ క్రికెట్‌ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించ‌డంతో పాటు భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకూ ఓ గుర్తింపు తీసుకురావడంలో మిథాలీ కృషి మాట‌ల‌తో స‌రిపెట్టేది మాత్రం కాదు. అహోరాత్రులు క‌ష్టించి, ఎదురైన అవ‌మానాల‌ను దిగ‌మింగి... జ‌ట్టును మిథాలీ న‌డిపిన తీరు అత్య‌ద్భుత‌మనే చెప్పాలి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... క్రికెట‌ర్లుగా మ‌హిళా క్రీడాకారులు ఏ త‌ర‌హా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ర‌న్న విష‌యాన్ని మిథాలీ క‌ళ్ల‌కు క‌ట్టింది. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి టీవీ ఛానెల్‌ కిచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మిథాలీ మ‌న‌సు విప్పి మాట్లాడార‌నే చెప్పాలి. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చాలా ధైర్యంగా... ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా మిథాలీ ఇచ్చిన స‌మాధానాలు అటు బీసీసీఐలోనే కాకుండా పురుష క్రికెట్‌ లోనూ ప్ర‌కంప‌న‌లు సృష్టించేవిగానే ఉన్నాయ‌న్న వాద‌న లేక‌పోలేదు.

అయినా ఈ ఇంట‌ర్వ్యూలో మిథాలీ ఏమేం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... అమ్మాయిలు సక్సెస్‌ సాధిస్తే మగాళ్లు సహించలేరు, ఏదోటి అంటూ ఉంటార‌ని ఆమె కుండ‌బ‌ద్దలు కొట్టేశారు. అమ్మాయిల‌కు ఆట‌లెందుకు, దెబ్బ‌లు త‌గిలితే పెళ్లి ఎవ‌రు చేసుకుంటార‌ని ప్ర‌శ్న‌లు వినిపిస్తుంటాయ‌ని చెప్పారు. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా త‌న‌కు వ‌చ్చిన చాలా పెళ్లి సంబంధాలు త‌ప్పిపోయాయ‌ని కూడా ఆమె పేర్కొన్నారు. మేం ఆడుతున్న గేమ్ ఏమిటి? మేం వేసుకునే డ్రెస్సులేమిటి? అన్న కోణంలోనూ కొంద‌రు ఆక‌తాయి కామెంట్లు చేస్తున్న వైనం త‌మ‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌ని కూడా చెప్పారు. ఆట‌లో గెలిస్తే... పురుష క్రికెటర్లైతే ఛీర్స్ చెప్పుకుంటార‌న్న మిథాలీ... తాము మాత్రం అలా కాద‌ని తేల్చేశారు.

అయినా త‌న‌కు మిథాలీగా గుర్తింపు మాత్ర‌మే చాల‌ని, లేడీ స‌చిన్ గుర్తింపు అవ‌స‌రం లేద‌ని కూడా ఆమె ముక్కుసూటిగానే చెప్పేశారు. అస‌లు బీసీసీఐలోనే పెద్ద ఎత్తున రాజ‌కీయాలు జ‌రుగుతుంటాయ‌ని కూడా మిథాలీ చాలా ధైర్యంగా సంచ‌ల‌న కామెంట్ చేశారు. జాతీయ స్థాయి క్రికెట్ జ‌ట్టులో స్థానం ద‌క్కించుకోవాలంటే కేవ‌లం ఆట వ‌స్తే మాత్ర‌మే స‌రిపోద‌ని, అందుకు ఇంకా చాలా కావాల్సి ఉంద‌ని కూడా మిథాలీ చెప్పిన స‌మాధానం... నిజంగా లేడీ క్రికెట‌ర్ల‌కు ఎంత మేర ఇబ్బందులు ఎదురవుతున్నాయ‌నే విషయాన్ని చెప్ప‌క‌నే చెప్పేసింద‌నే చెప్పాలి.