Begin typing your search above and press return to search.

నాశనం చేయాలని చూశారు.. మిథాలీ లేఖాస్త్రం..

By:  Tupaki Desk   |   28 Nov 2018 11:47 AM IST
నాశనం చేయాలని చూశారు.. మిథాలీ లేఖాస్త్రం..
X
భారత మహిళా క్రికెట్ లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్ లో సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ ను తప్పించడం.. జట్టు ఓడిపోవడంతో టీం మేనేజ్ మెంట్ పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.. దీనిపై మిథాలీరాజ్ తాజాగా స్పందించారు. భారత మహిళా క్రికెట్ ను ఓ స్థాయికి తెచ్చిన తనను ఇలా ఘోరంగా అవమానించడంపై ఆమె వాపోయారు. తన కెరీర్ ను కొందరు అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె బీసీసీఐకి రాసిన లేఖ కలకలం రేపుతోంది.

మిథాలీరాజ్ లేఖలో జట్టు కోచ్ రమేష్ పవార్ తనను అవమానించారంటూ వాపోయింది. తనను జట్టు నుంచి తప్పించడంపై తీవ్రంగా ఆవేదన చెందానని తెలిపింది. టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ పై ఎలాంటి ద్వేషం లేదని.. కోచ్ తప్పించాలని ఆదేశించడంతో హర్మన్ ప్రీత్ అమలు చేసిందని విన్నవించారు. దేశం కోసం ప్రపంచకప్ సాధించాలని ఆశపడ్డా.. కానీ బంగారం లాంటి అవకాశాన్ని తనకు లేకుండా చేశారని.. బీసీసీఐకి రాసిన లేఖలో మిథాలీ వివరించారు.

ఇక తనను జట్టు నుంచి తప్పించడాన్ని సమర్థించిన సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీపై మిథాలీ పరోక్ష విమర్శలు చేశారు. కొందరు వ్యక్తులు తనను కావాలనే కుట్ర చేసి జట్టు నుంచి తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ లేఖ రాశానని తనకు హాని చేసే అవకాశం కూడా ఉందని మిథాలీ వాపోయారు. అధికారంలో ఉన్న కొందరు తనను నాశనం చేయాలని కుట్ర పన్నారని వివరించారు. నా కెరీర్ నాశనం అవుతోందని.. అందుకే జరిగిన విషయాలను చెప్పదలుచుకున్నాని వివరించారు. సెమీఫైనల్ కు ముందుకు 2 వరుస హాఫ్ సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నానని.. అయినా సెమీస్ లో తనను తప్పించి ముగ్గురు కొత్త వారిని తీసుకున్నారని.. అంతేకాకుండా మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించిదని ఆమె లేఖలో విమర్శలు గుప్పించారు.