Begin typing your search above and press return to search.

లేడీ సచిన్... క్రికెట్ కు మిథాలీ గుడ్ బై

By:  Tupaki Desk   |   8 Jun 2022 11:04 AM GMT
లేడీ సచిన్... క్రికెట్ కు మిథాలీ గుడ్ బై
X
అమ్మాయిలకు క్రికెట్టా? అనే దశ నుంచి.."అబ్బో అమ్మాయిల క్రికెట్" అనే స్థాయి తెచ్చిన అద్భుత ప్లేయర్ మిథాలీ రాజ్ ఇక మనకు మైదానంలో కనిపించదు. పరుగుల ప్రవాహంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను తలపించి.. లేడీ సచిన్ గా పేరుగాంచిన మిథాలీ మెరుపులను మనిమక గ్రౌండ్ లో చూడలేం.. భారత దేశంలో మహిళల క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన మన హైదరాబాదీ మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని బుధవారం ఆమె ట్వీట్ ద్వారా వెల్లడించింది. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ గా సుదీర్ఘ కాలం సేవలందించిన మిథాలీ తనకిష్టమైన ఆటకు వీడ్కోలు పలికింది. మహిళల క్రికెట్‌ను తీర్చిదిద్దడంలో తన వంతుగా శక్తివంచన లేకుండా కృషిచేశానని, ఇన్నాళ్లూ తనపై చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలని తెలిపింది.

టి20లకు నాలుగేళ్ల కిందటే..39 ఏళ్ల మిథాలీ రాజ్ 1999నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.రికార్డుల రారాణిగా పేరుగాంచింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) ఆమె పేరిటే ఉంది.232 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 7805 పరుగులు చేశారు. 7వేల పరుగులు సాధించిన మైలు రాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషం. వన్డేల్లో 7 శతకాలు 64 అర్ధ శతకాలు చేసిన మిథాలీ.. టీ20 మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టింది. 89 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తంగా 2,364 పరుగులు సాధించింది. ఇందులో 17 అర్ధశతకాలున్నాయి. టీమిండియాకు సుదీర్ఘ కాలం నాయకత్వం వహించింది.

క్రికెట్టే ఆమె జీవితం..మిథాలీ పదేళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. దాదాపు 30 ఏళ్లుగా క్రికెట్ ఆమె జీవితంతో పెనవేసుకుపోయింది. యువ క్రీడాకారులకు తగ్గని ఫిట్ నెస్ ఆమె సొంతం. 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు..మరెన్నో రికార్డులు ఆమె సొంతం. 1982 డిసెంబరు 3న తమిళనాడుకు చెందిన దొరైరాజ్, లీలీరాజ్ దంపతులకు రాజస్థాన్ లో మిథాలీ జన్మించింది. వీరి కుటుంబం హైదరాబాద్ లో స్థిర పడింది. కుడిచేతివాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన మిథాలీ.. అప్పుడప్పుడు లెగ్ స్పిన్ వేసేది. ఎన్నో రికార్డులను తన ఖాతాలో జమ చేసుకుంది.

రికార్డుల రారాణి 12 టెస్టుల్లో 699 పరుగులు చేసిన మిథాలీ.. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో ఏడు వేల పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్. వన్డేల్లో ఏడు వరుస అర్ధ శతకాలు ఆమె సొంతం. అంతేకాదు.. 2018 ఆసియా కప్ టి20 టోర్నీ సందర్భంగా మిథాలీ అరుదైన రికార్డు సాధించింది. పురుషులు, మహిళ క్రికెట్లో.. టి20ల్లో 2 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచింది. టి20ల్లో 2 వేల పరుగులు చేసిన తొలి అంతర్జాతీయ మహిళా క్రికెటర్ కూడా ఆమెనే.

2005లోనే టీమిండియా కెప్టెన్ 2005లోనే అంటే 17 ఏళ్ల కిందటే టీమిండియా కెప్టెన్ అయింది మిథాలీ రాజ్. 2005,, 2017 వన్డే ప్రపంచ కప్ లలో కెప్టెన్సీ వహించింది. అంతేకాదు.. 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఆమెనే. 2109 సెప్టెంబరులో టి20ల నుంచి తప్పుకొన్న మిథాలీ.. వన్డేలు, టెస్టుల్లో కొనసాగింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ కూడా మిథాలీనే కావడం విశేషం. 2017లో విజ్జెడన్ లీడింగ్ మహిళా క్రికెటర్, అర్జున అవార్డు, పద్మశ్రీ, ధాన్యచంద్ ఖేల్ రత్న తదిరత ఎన్నోజాతీయ అవార్డులు మిథాలీని వరించాయి.

పక్కా హైదరాబాదీ..మిథాలీ పక్కా హైదరాబాదీ. తండ్రి దొరైరాజ్ వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యారు. హైదరాబాద్ లోని కీస్ హై స్కూల్ లో మిథాలీ చదువుకుంది. సికింద్రాబాద్ లోని కస్తూర్బా గాంధీ కళాశాలలో ఇంటర్ చేసింది. పాఠశాల రోజుల్లో సోదరుడితో కలిసి క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. 14 ఏళ్ల వయసులోనే .. 1997 ప్రపంచ కప్ జట్టు ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకుంది. అయితే, తర్వాతి ఐదేళ్లకు టీమిండియాకు ఎంపికైంది.