Begin typing your search above and press return to search.

కరోనాకు సంబంధించి ఒళ్లు జలదరించే నిజం.. తెలుగు సీఎంలు వింటున్నారా?

By:  Tupaki Desk   |   1 Aug 2021 11:30 PM GMT
కరోనాకు సంబంధించి ఒళ్లు జలదరించే నిజం.. తెలుగు సీఎంలు వింటున్నారా?
X
రోడ్లు కిటకిటలాడుతున్నాయి. ఆ మాటకు వస్తే ట్రాఫిక్ జాంలు తప్పట్లేదు. పెద్ద పెద్ద నగరాల్లో మాల్స్ కళకళలాడుతున్నాయి. పండుగ వచ్చినా.. పర్వదినాలు వచ్చినా గుళ్లు.. ప్రార్థనా స్థలాలు భక్తులతో నిండుతున్నాయి. మొన్న ముగిసిన బక్రీద్ కావొచ్చు.. ఇవాల్టి రోజున తెలంగాణలో నడుస్తున్న బోనాలు.. ఏపీలోని పర్వదినాలు.. ఫ్రెండ్ షిప్ డేలు.. ఏం చూసినా ఒక్కటి మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. కమ్ముకొస్తున్న కరోనా మూడో వేవ్ గురించి ప్రస్తుతానికి ప్రజలు ఆలోచించటం మానేశారు. సెకండ్ వేవ్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న వారు.. థర్డ్ వేవ్ పెద్దగా ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. మరికొందరు మాత్రం మరికాస్త సమయం ఉందని.. అప్పటివరకైనా తిరనీయాలని.. ఆ తర్వాత ఎటూ ఇల్లు అనే జైలుశిక్ష తప్పదని చెబుతున్నారు.

మరోవైపు నిఫుణులు ఆందోళన మరోలా ఉంది. ఇప్పటికే దేశంలో థర్డ్ వేవ్ సూచికలు కనిపిస్తున్నాయని.. కేరళలో భారీగా నమోదవుతున్న కేసుల్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని లేకుంటే ముప్పు తప్పదంటున్నారు. అయినప్పటికీ.. ప్రజలు ఈ వార్నింగ్ లను పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా కనిపించట్లేదు. ఇలాంటివేళ.. తాజాగా ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా చెబుతున్న మాటల వింటే చెమటలు పట్టాల్సిందే. కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా పోలేదని.. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు.

తాజాగా ఆయనో మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''దేశంలో మహమ్మారి ముగిసిపోలేదు. సూపర్ స్పైడర్లుగా మారే కార్యక్రమాల్ని నియంత్రించాలి. ఇలాంటి కార్యక్రమాల ప్రభావం సాధారణంగా మూడు వారాల తర్వాత కనిపిస్తుంది'' అని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ నేతలు..ఆధ్యాత్మిక వేత్తలతో పాటు.. పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీని వల్ల ఎదురయ్యే ఇక్కట్లను గుర్తు చేసేలా గులేరియా మాటలు ఉన్నాయని చెప్పాలి.

అంతేకాదు.. అత్యవసరం కాని ప్రయాణాలు మంచిది కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనల్ని పాటించాల్సిందేనని చెప్పారు. మహమ్మారి ముప్పు తగ్గలేదన్న మాట వినిపిస్తున్న వేళ.. పలువురు బూస్టర్ డోసుల గురించి ప్రస్తావిస్తున్న వైనం తెలిసిందే. ఈ అంశంపైనా ఆయన మాట్లాడారు. బూస్టర్ డోసుల అవసరంపై తగినంత ఆధారాలు లభించలేదన్నారు.

'చాలామంది మొదటి డోసే పొందనప్పుడు మనం బూస్టర్ డోసుల గురించి మాట్లాడటం సరైంది కాదు. ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండే వరకు.. వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ సురక్షితంగా లేరనే చెప్పాలి. ఒక ప్రాంతంలో కొత్త వేరియంట్ వస్తే.. అది ఇతర దేశాలకు వ్యాపించే వీలుంది. కాబట్టి.. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉంది. అంటే.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునే వరకు ముప్పు తప్పనట్లే. మహమ్మారి నుంచి బయటపడాలంటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది'' అని చెప్పిన వైనం చూస్తే.. కొత్త సత్యం కళ్ల ముందు కనపడక మానదు.

నేను బాగుంటే చాలు అన్నది కాకుండా..మనమంతా బాగుండాలన్న భావన అన్ని దేశాలకు వస్తే తప్పించి.. ఈ ప్రపంచంలో ఎవరూ సురక్షితం కాదన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటివరకు నేను వ్యాక్సిన్ వేసుకున్నానన్న ధీమాను పక్కన పెట్టి.. వ్యాక్సిన్ వేసుకోని వారి చేత టీకా వేయించటం.. అందరూ వ్యాక్సినేట్ అయితే తప్పించి.. మహమ్మారి ముప్పు తప్పదని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. జనాలు ఎక్కువగా చేరే అవకాశం ఉన్న ఏ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. 'మే' నాటి విషాదం మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది.