Begin typing your search above and press return to search.

`మిషన్ కర్మయోగి`కి మోడీ శ్రీకారం

By:  Tupaki Desk   |   3 Sep 2020 10:30 AM GMT
`మిషన్ కర్మయోగి`కి మోడీ శ్రీకారం
X
2014లో ప్రధాని మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో పలు సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ మోడీ అనేక సంస్కరణలు చేపట్టారు. తాజాగా, ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి మోడీ ‘మిషన్‌ కర్మ యోగి’కి శ్రీకారం చుట్టారు. ఈ మిషన్ కోసం ప్రధాని నేతృత్వంలో ప్రత్యేక మండలి, మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు చేపట్టిన అతిపెద్ద సంస్కరణ ఈ మిషన్ కర్మ యోగి అని ప్రధాని మోడీ అన్నారు. అన్ని స్థాయిల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెరగడానికి, ‘తగిన వ్యక్తికి తగిన పని’ అప్పగించడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని మోడీ చెప్పారు.

ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 46 లక్షల మందికి `మిషన్ కర్మయోగి` శిక్షణకు రూ.510.86 కోట్లు ఖర్చవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. `మిషన్‌ కర్మయోగి` మానవ వనరుల నిర్వహణ విధానాలను సమూలంగా మెరుగుపరుస్తుందన్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని తీర్చిదిద్దుతుందని, వారి సత్తాను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. పారదర్శకత, సాంకేతికతల కలయికతో నవ్యావిష్కరణల దిశగా వారిని సానబెడుతుందని అన్నారు. 2017లో ముస్సోరీలోని ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రాన్ని ప్రధాని సందర్శించారని, తమతమ విభాగాలకే పరిమితమయ్యేలా కాకుండా అన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చేలా శిక్షణ విధానాన్ని మార్చాలన్న ఆలోచన కలిగిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు.

గతంలో, శిక్షణ కేవలం నిబంధనల ఆధారంగా ఉండేదని, ఇప్పుడు ఉద్యోగి పాత్ర (రోల్‌) ఆధారంగా ఉంటుందని జితేంద్ర సింగ్ తెలిపారు. గతంలో ఉన్నత చదువులు, సామర్థ్యం పెంచుకొనే అవకాశాలు కొందరు అధికారులకే ఉండేవని, ఇప్పుడు అందరికీ అవి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో అఖిల భారత సేవలకే పరిమితమైన మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌ ను ఇప్పుడు అన్ని సర్వీసులకూ, అన్నిస్థాయిలలోని అధికారులకూ వర్తింపజేస్తారని చెప్పారు. ఇందుకోసం, డీటీహెచ్‌లో `కర్మయోగి` టీవీ ఛానల్‌ ఏర్పాటుచేస్తామని, ప్రతి అధికారి పనితీరు డిజిటల్‌ రూపంలో నిక్షిప్తమై ఉంటుందని జితేంద్ర సింగ్ తెలిపారు.