Begin typing your search above and press return to search.

కేసీఆర్ విజన్ కు వాటర్ మ్యాన్ ఫిదా

By:  Tupaki Desk   |   19 Feb 2020 10:51 AM IST
కేసీఆర్ విజన్ కు వాటర్ మ్యాన్ ఫిదా
X
వేలాది కోట్లు ఖర్చు చేస్తే చేశారు. కానీ.. ఖర్చుకు తగ్గ ఫలితం కంటి ముందు కనిపిస్తే ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. తెలంగాణ లో కనుచూపు మేర నీళ్లు కనిపించే ప్రాంతాలు తక్కువగా ఉంటాయి. ఆ లోటును తీర్చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. యుద్ధ ప్రాతి పదికన నిర్మించిన ఈ ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. వేలాది కోట్లను ఖర్చు పెట్టేందుకు వెనుకాడక పోవటమే కాదు.. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోవటానికి కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటని చెబుతారు.

అయితే.. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం మీద పడే భారం రానున్న రోజుల్లో వడ్డీతో సహా ఆదాయాన్ని ఇచ్చేలా చేస్తుందన్న వాదన లేకపోలేదు. ఇదెంత వరకు నిజమన్న విషయం కొంతకాలం వెయిట్ చేస్తే తప్పించి చెప్పలేని పరిస్థితి. ఇప్పటికి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని.. గోదావరి నీటితో కళకళలాడుతున్న వైనం చూసిన తెలంగాణ ప్రజలు పులకరించి పోతున్నారు. కిలోమీటర్ల మేర నీళ్లు నిండి ఉండటాన్ని చూసి.. కేసీఆర్ విజన్ కు ఫిదా అవుతున్నారు.

నీటిని సమర్థంగా కాపాడుకుంటున్న వైనం సామాన్యులను మాత్రమే కాదు.. అసమాన్యుల్ని సైతం మెప్పిస్తుంది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుపరిచితుడైన రాజేందర్ సింగ్ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి నీటితో కళకళలాడుతున్న పరిసరాలకు ఆయన ఫిదా అయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ ఆనకట్ట.. లక్ష్మీ పంప్ హౌస్.. ఎత్తి పోతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాల్ని తెలుసుకున్న ఆయన.. కంటి ముందు కనిపిస్తున్న జలకళకు ఫిదా అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ పై ప్రశంసల వర్షం కురిపించినట్లుగా చెబుతున్నారు. ప్రాజెక్టు రూపకల్పన చేసిన ఇంజనీర్ల ను ఆయన పొగిడేశారు. సామాన్యులనే కాదు.. అసమాన్యుల్ని తన విజన్ తో ఫిదా చేసిన క్రెడిట్ సీఎం కేసీఆర్ దేనని చెప్పక తప్పదు.