Begin typing your search above and press return to search.

మిస్ ఉక్రెయిన్ జీకే ఆ స్థాయిలో ఉంది!

By:  Tupaki Desk   |   8 Sept 2016 10:12 AM IST
మిస్ ఉక్రెయిన్ జీకే ఆ స్థాయిలో ఉంది!
X
ఒకటో తరగతి చదువుతున్న కుర్రాడికి కూడా దేశ ప్రధానమంత్రి పేరు తెలుస్తుంది. నిత్యం ప్రజల నోళ్లలో నానడం, టీవీల్లో వినిపించడం వంటి కారణాలతో అయినా దేశ ప్రధానమంత్రి పేరు గుర్తుపెట్టుకోవడం చాలా చిన్న విషయం. అది మరిచిపోవడం, తెలియదు అనడం ఆశ్చర్యమే కాదు, అవమానం కూడా! ప్రస్తుతం ఇలాంటి అవమానాన్నే పొంది, కొందరికి మాత్రం హాస్యాన్ని అందించింది అందాల భామ అలెగ్జాండ్రియా.

మిస్ ఉక్రెయిన్ కిరీటం కోసం పోటీ పడింది అలెగ్జాండ్రా కుచెరెంకో. 18ఏళ్ల వయసున్న ఈమెకున్న జనరల్ నాలెడ్జ్ చూసి అక్కడ అంతా షాక్ అయ్యారు. జీకే ప్రశ్నల సందర్భంగా ఉక్రెయిన్ ప్రధాని పేరు చెప్పాలని ఆమెను అడిగారు నిర్వాహకులు. దీంతో ముఖ కవలికలన్నీ మార్చేసిన కుంచెరెంకో... ఒకటో తరగతి కుర్రాడిని తొమ్మిదో ఎక్కం అప్పగించమన్నప్పుడు పెట్టినట్లు ముఖం పెట్టింది. ఆ నిర్వాహకులు అడిగింది ఒక ప్రశ్న.. దానికి ఈమె తెగ టెన్షన్ పడిపోవడం.. ఆ వేదికపై ఇదోరకం హాస్యం.

ఇక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనేమో, వచ్చినట్లే వచ్చిన కిరీటం చేజారిపోతుందేమోనని తెగ టెన్షన్ పడిన ఈ అందాల భామ.. సుదీర్ఘ ఆలోచన అనంతరం తాను చెప్పలేననే విషయం చెప్పేసింది. సొంత దేశ ప్రధాని పేరైన వోలోదిమిర్ గ్రోయిస్మాన్ పేరు చెప్పలేకపోవడంపై తొలుత డీలాపడిన నిర్వాహకులు.. ఇంకానయం పుతిన్ పేరు చెప్పి పరువు తీయలేదని ఆనందపడ్డారట. ఆఖరికి అలెగ్జాండ్రాకే మిస్ ఉక్రెయిన్ కిరీటం వచ్చిందనుకోండి.