Begin typing your search above and press return to search.

మీడియాకు చుక్కలు చూపించిన మనమ్మాయ్?

By:  Tupaki Desk   |   12 Feb 2021 9:47 AM GMT
మీడియాకు చుక్కలు చూపించిన మనమ్మాయ్?
X
అప్పటివరకు చర్చకు రాని వారు.. ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారిపోతుంటారు. ఇలాంటి వారు ఏం ఆలోచిస్తారో? మరెలాంటి వ్యూహంతో ఉంటారో కానీ.. మీడియాకు మాత్రం సినిమా కష్టాలు తప్పని పరిస్థితి. తాజాగా వెల్లడైన మిస్ ఇండియా 2021 విజేత విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చాలాకాలం తర్వాత హైదరాబాదీ అందం మిస్ ఇండియా వేదిక మీద మెరిసింది.

గతంలోనూ హైదరాబాద్ మహానగరానికి చెందిన పలువురు భామలు మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. తాజాగా మానస వారణాసి విజేతగా నిలిచారు. హైదరాబాద్ కు చెందిన ఆమె.. స్కూలింగ్.. కాలేజీ మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. వాసవి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆమె.. అనూహ్యంగా పెద్ద సెలబ్రిటీగా మారింది.

మిస్ ఇండియా లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్న తర్వాత.. స్థానిక మీడియా విపరీతమైన ప్రాధాన్యతను ఇవ్వటం మామూలే. అయితే.. మానసకు సంబంధించిన పీఆర్ టీం కానీ.. ఆమె కానీ మీడియాకు అందుబాటులోకి రాకపోవటంతో మీడియా ప్రతినిధులకు చుక్కలు కనిపించాయి. బ్యూటీ కాంటెస్టులో విజేతగా మారటం.. అదీ.. తెలుగు అమ్మాయి కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది.

అయితే.. మానసకు సంబంధించిన వివరాలు కొన్నిమాత్రమే ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో కనిపించటం.. మిగిలినవేమీ లేకపోవటంతో.. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటం మహా కష్టంగా మారింది. దీనికి తోడు.. ఆమె పీఆర్ టీం మీడియాకు అందుబాటులోకి రాకపోవటంతో మీడియా ప్రతినిధులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. సమాచార సేకరణ కష్టంగా మారితే.. మీడియా యాజమన్యాల నుంచి ఒత్తిడి మరింత ఎక్కువగా ఉండటంతో.. అందాల పోటీలో గెలుపొందిన మానస వివరాలు సేకరించటం పెద్ద సవాలుగా మారిందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఇబ్బంది కర పరిస్థితిని తాము ఎదుర్కోలేదని మీడియా ప్రతినిధులు వాపోవటం గమనార్హం.