Begin typing your search above and press return to search.

అంబానీ ఇంటి అడ్రస్ కోసం ఆగంతుల ఆరా .. ఒకరు అరెస్ట్ !

By:  Tupaki Desk   |   9 Nov 2021 8:33 AM GMT
అంబానీ ఇంటి అడ్రస్ కోసం ఆగంతుల ఆరా .. ఒకరు అరెస్ట్ !
X
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖేష్ అంబానీ నివాసరమైన అంటిలియా అడ్రస్ అడిగిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం ముంబై పోలీసులు గాలింపు చేపట్టారు. ఓ టాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో టాక్సీ డ్రైవర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు.. అనంతరం ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఓ కారులోని ఇద్దరు వ్యక్తులు అంటిలియా అడ్రస్ కోసం అడిగారని పోలీస్ కంట్రోల్ రూమ్‌ కు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది.

ఓ కారులో వెళుతున్న ఆ ఇద్దరు ఆజాద్ మైదాన్ సమీపంలోని ఖిలా కోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్‌ ను అంటిలియా అడ్రస్ కోసం అడిగినట్టు సమాచారం. మరోవైపు వారి గురించి గాలిస్తున్న పోలీసులు.. సిల్వర్ కలర్ కారు కోసం అన్వేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నాకాబందీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు నంబర్‌ గురించిన సమాచారాన్ని టాక్సీ డ్రైవర్ పోలీసులకు అందించారు. అయితే ఆ కారు నంబర్ సరైంది కాదని పోలీసులు భావిస్తున్నారు. యెల్లో ప్లేట్‌ ఉన్న సిల్వర్ కలర్ వ్యాగన్ ఆర్ కారు కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులోని ఇద్దరు వెనుక సీటులో కూర్చున్నట్టు పోలీసులకు తెలిసింది.

ఈ క్రమంలో ఆ ఇద్దరిలో ఒకడిని గుర్తించారు. అతణ్ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. అతని పేరును ఆజాద్ మైదాన్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు ముగిసిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. గుజరాత్‌కు చెందినవాడని, ట్యాక్సీ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. ఏ కారణంతో అతను ముంబైకి వచ్చాడు , అనుమానాస్పద ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఎందుకు ఆరా తీశాడు అనే విషయాలపై అతణ్ని ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు.

అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ లేవని నిర్ధారించినట్లు ఆజాద్ మైదాన్ పోలీసులు పేర్కొన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తోన్నామని చెప్పారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముంబై కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చామని వివరించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం కొన్ని చోట్ల తనిఖీలను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ ఎస్‌యూవీ కారు అంటీలియా సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని పై విచారణ చేపట్టడానికి ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ కారుతో సంబంధం ఉందనే కారణంతో ఎన్ ఐ ఏ అధికారులు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌ స్పెక్టర్ సచిన్ వాజేను అరెస్ట్ చేశారు

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా సమాంతరంగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నగరంలోని కీలకమైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర పోలీసులు హై అల్టర్ జారీ చేశరు. పలు ప్రాంతాల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆజాద్ మైదాన్ నుంచి అంటిలియాకు వెళ్లే ఐదు వేర్వేరు మార్గాల్లో పోలీసులు సెక్యూరిటీ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అయితే అంటిలియా భవనానికి పటిష్టమైన భద్రత ఉంటుందని తెలిపారు.