Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డుతున్నా!..ట్ర‌బుల్ షూటింగే లేదు!

By:  Tupaki Desk   |   29 Jan 2019 9:53 AM IST
జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డుతున్నా!..ట్ర‌బుల్ షూటింగే లేదు!
X
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు అవ‌కాశాలు మెండుగానే ఉన్న వైసీపీని ఇప్పుడు ఓ ప్ర‌ధాన స‌మ‌స్య వేధిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ స‌మ‌స్య ఏమిటంటే... ట్ర‌బుల్ షూటింగ్ లోప‌మే. 2014లోనే అందివ‌చ్చిన అధికారాన్ని అబ‌ద్ద‌పు హామీలిచ్చి చేప‌ట్ట‌లేన‌న్న ఒకే ఒక్క కార‌ణంతో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌దిలేసుకున్నారు. నాడు చంద్ర‌బాబు అమ‌లు సాధ్యం కాని హామీలు ఇస్తున్నార‌ని - తాను మాత్రం అమ‌లు చేసే హామీలే ఇస్తాన‌ని - ఈ నేప‌థ్యంలోనే రైతు రుణ‌మాఫీని అమ‌లు చేస్తాన‌ని చెప్ప‌లేన‌ని జ‌గ‌న్ చాలా విస్ప‌ష్టంగానే చెప్పేశారు. ఈ మాట‌తో త‌న‌కు ఎంత మేర న‌ష్టం జ‌రుగుతుంద‌న్న విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్ చాలా ధైర్యంగానే ఎన్నిక‌ల‌కు వెళ్లారు. నాడు జ‌గ‌న్ ఏం చెప్పారో... ఈ నాలుగున్న‌రేళ్ల‌లో చంద్ర‌బాబు స‌ర్కారు చేసి చూపించింది. రైతు రుణ మాఫీ పై చెప్పాల్సినంత చెప్పేసి - చేయాల్సినంత జాప్యం చేసేసి... ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని మ‌రింత‌గా అప్పుల్లోకి నెట్టేసి... రుణ మాఫీ అయిపోయింద‌ని అనిపించేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కారు చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ.. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? ప‌్ర‌జ‌ల‌ను త‌న వైపున‌కు తిప్పేసుకునేందుకు చంద్ర‌బాబు ఎంత‌లా మాయ చేస్తున్నార‌న్న విష‌యాన్ని వివ‌రించ‌డంలో జ‌గ‌న్ పూర్తి స్థాయిలో స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఇందుకోసం ఆయ‌న ఎంత మేర క‌ష్ట‌ప‌డ్దారో చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ... తాము అధికారంలోకి వ‌స్తే సంక్షేమాన్ని ఏ మేర ప‌రుగులు పెట్టిస్తామ‌న్న విష‌యాన్ని జ‌నానికి చెప్పేందుకు జ‌గ‌న్ ఏకంగా 14 నెల‌ల పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుధీర్ఘ పాద‌యాత్ర చేశారు. ఈ యాత్ర‌తో వైసీపీకి మంచి మైలేజీ వ‌చ్చింది. ఇప్ప‌టిదాకా జ‌రిగిన స‌ర్వేల‌న్నీ కూడా జ‌గ‌న్‌ దే అధికార‌మ‌ని చెప్ప‌డమే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో పాటు చంద్ర‌బాబు స‌ర్కారు అవినీతి పైనా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో దూసుకెళ్లార‌నే చెప్పాలి.

ఇంత‌దాకా బాగానే ఉన్నా... పార్టీలో జ‌గ‌న్ ఒక్కరేనా? జ‌గ‌న్ త‌ప్ప ఇంకెవ‌రూ లేరా? ఉంటే వారేం చేస్తున్నట్లు? ఎంత‌సేపూ జ‌గ‌న్ గ‌ళ‌మే వినిపించాలా? ఇత‌రుల గొంతులెందుకు పెగ‌ల‌డం లేదు? స‌రే.. ప్ర‌భుత్వ తీరును తూర్పార‌బ‌ట్ట‌డంలో జ‌గ‌న్ ను మించి తామేం చేయ‌గ‌ల‌మ‌న్న భావ‌న ఉంటే... మ‌రి పార్టీ వ్య‌వ‌హారాల‌ను అయినా చెక్క‌బెట్టే బాధ్య‌త తీసుకోరా? ఎప్ప‌టిక‌ప్పుడు చోటుచేసుకుంటున్న కీల‌క ప‌రిణామాల‌ను త‌మ పార్టీకి అనుకూలంగా మ‌ల‌చుకునే నేత‌లు పార్టీలో లేరా? ఈ ప్ర‌శ్న‌ల‌కు దాదాపుగా లేద‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే... కాంగ్రెస్‌ కు చేయిచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టీడీపీలోకి చేరిపోతుండ‌ట‌మే. మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి.. రాయ‌ల‌సీమ ముఖ‌ద్వారం క‌ర్నూలు జిల్లాలో మంచి ప‌ట్టున్న నేతే. క‌ర్నూలు పార్ల‌మెంటు ప‌రిధిలో ఇప్ప‌టికీ కాంగ్రెస్‌ కు అంతోఇంతో ఓటు బ్యాంకు ఉందంటే అది సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి చ‌ల‌వే.

అలాంటి సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి... కాంగ్రెస్‌ ను వీడుతున్న‌ట్లుగా సంకేతాలు పంపిన సంద‌ర్బంగా దానిని వైసీపీ నేత‌లు ఎందుకు త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోలేక‌పోయారు. అస‌లు ట్ర‌బుల్ షూటింగ్ స‌మ‌ర్థ‌వంతంగా చేసుకువ‌చ్చే నేత‌లు వైసీపీలో ఉన్నారా? అంటే... ఈ ఒక్క సంఘ‌ట‌న‌ను చూసిన త‌ర్వాత లేర‌నే చెప్పేయ‌క త‌ప్ప‌దు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోట్ల‌... వ‌స్తే గిస్తే వైసీపీలోకి రావాలి గానీ... టీడీపీలోకి వెళ్ల‌డ‌మేంటీ? ఇక్క‌డే వైసీపీలో లోపించిన ట్ర‌బుల్ షూటింగ్ ను ప‌ట్టి మ‌రీ చూపుతోంది. వైసీపీ నేత‌లు స‌రైన స‌మ‌యంలో స్పందించి ఉంటే.. కోట్ల ఇప్పుడు వైసీపీలోకి జాయిన్ అయ్యేవారన్న విశ్లేష‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వైసీపీ నేత‌ల చేత‌గానిత‌నం వ‌ల్లే... కోట్ల ఇప్పుడు సైకిల్ ఎక్కుతున్నార‌ని కూడా స‌ద‌రు విశ్లేష‌ణ‌లు బ‌ల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. మొత్తంగా ట్ర‌బుల్ షూటింగ్ లో వైసీపీ చాలా వెనుక‌డిపోయింద‌ని - అస‌లు ఆ త‌ర‌హా నైపుణ్యం ఉన్న నేత వైసీపీలో లేర‌ని వాద‌న వినిపిస్తోంది. ఒక్క జ‌గ‌నే అన్ని వ్య‌వ‌హారాలు చూసుకోవాలంటే కుద‌ర‌దు కదా. మొత్తంగా రాజ‌కీయాల్లో అప్ప‌టిక‌ప్పుడు ఏర్ప‌డే అవ‌కాశాల‌ను వైసీపీ వినియోగించుకోలేక‌పోగా... చంద్ర‌బాబు మాత్రం ఈ అవ‌కాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.