Begin typing your search above and press return to search.

పదో తరగతి కుర్రోడి ట్రైన్ సెల్ఫీ చావుకొచ్చింది

By:  Tupaki Desk   |   14 Dec 2016 4:10 AM GMT
పదో తరగతి కుర్రోడి ట్రైన్ సెల్ఫీ చావుకొచ్చింది
X
ఇటీవ‌ల ఓ స‌ర్వేలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెల్ఫీలు దిగ‌డంలో భార‌త‌దేశం టాప్ లో ఉన్న‌ట్లుగా తేలిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. అ షోకులో తెలుగు కుర్రాళ్లు సైతం నిలుస్తున్న‌ట్లుగా ఉంది. సెల్ఫీల మోజు వెర్రి తలలు వేస్తున్న ఈ ప‌రిస్థితుల్లో ఓ కుర్రాడు రైలుతో సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.

విజయవాడలో వరదరాజులు అనే ప‌దిహేనేళ్ల కుర్రాడు వేగంగా దూసుకొస్తున్న రైలు పక్కన నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. రైలును స్పష్టంగా సెల్‌ ఫోన్‌ లో తనతో కలిపి బంధించేందుకు ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మధురానగర్‌ పప్పులమిల్లు రైల్వేగేటు వద్ద మ‌చిలీపట్నం ప్యాసింజర్ రైలు వస్తుండటంతో గేటు పడింది. సరిగ్గా అదే సమయంలో మాచవరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వరద రాజులు అక్కడికి వచ్చాడు. ట్రాక్‌ పక్కన నిలబడి వెనుకనుంచి రైలు వస్తుండగా చేతితో ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఫొటోలో రైలు మరింత బాగా రావాలనే ఉత్సాహంలో కొంచెం పక్కకు జరిగాడు. అలా రైలుకు సమీపంలోనికి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా వచ్చిన రైలు ఇంజిన్ విద్యార్థి చేతికి తగిలింది. అంతే ఎగిరి దూరంగా పడ్డాడు. ఈ ప్రమాదంలో వరదరాజులుకు కాలు విరగడంతో పాటూ ముఖం - ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న వారంతా స్పందించి వెంటనే క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రెవరు రైలును కొద్దిసేపు ఆపివేశారు. రైల్వేగార్డు వచ్చి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారంటూ హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నార‌ని రైల్వే వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/