Begin typing your search above and press return to search.

బస్సుల పంచాయతీపై మంత్రుల భేటీ...ఇప్పుడే కాదట

By:  Tupaki Desk   |   12 Sep 2020 2:00 PM GMT
బస్సుల పంచాయతీపై మంత్రుల భేటీ...ఇప్పుడే కాదట
X
ఏపీ, తెలంగాణల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పంచాయతీ ఇంకా తేలని సంగతి తెలిసిందే. విభజన చట్టం, నిబంధనలు వంటి విషయాలలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చల మీద చర్చలు జరుపుతున్నప్పటికీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య `కిలోమీటర్ల` పంచాయతీ తేలకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. బస్సు సర్వీసులు నడిపేందుకు తెలంగాన సర్కార్ పెట్టిన ప్రతిపాదన ఏపీ సర్కార్ కు నచ్చలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తేల్చేసేందుకు ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈనెల 14న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రచారాన్ని పువ్వాడ అజయ్ కొట్టిపారేశారు.

ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం జరగడం లేదని, కిలోమీటర్ బేసిస్లో ఇరు రాష్ట్రాల అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం జరుగుతుందని అజయ్ క్లారిటీ ఇచ్చారు. అప్పటిదాకా అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయన్నారు. కాగా, తెలంగాణలో ఆంధ్రా బస్సులు 2.60 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతుండగా, ఏపీలో తెలంగాణ బస్సులు 1.60 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఏపీ నడుపుతున్న 2.60 లక్షల కిలోమీటర్లలో, లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. అయితే, లక్ష కిలోమీటర్లకు బదులు 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఏపీ ఆర్టీసీ అధికారులు చెప్పారు. మిగతా 50 వేల కిలోమీటర్లు తిరిగేవిధంగా ఏపీలో తెలంగాణ బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదించింది. 350 బస్సులు కొనే పరిస్థితిలో తెలంగాణ సర్కార్ లేకపోవడంతో ఈ వ్యవహారంపై పీటముడి కొనసాగుతూనే ఉంది.