Begin typing your search above and press return to search.

మంత్రి వ‌ర్సెస్ మాజీ మంత్రి..! మ‌చిలీప‌ట్నం.. హాట్ గురూ!!

By:  Tupaki Desk   |   4 March 2021 9:00 PM IST
మంత్రి వ‌ర్సెస్ మాజీ మంత్రి..! మ‌చిలీప‌ట్నం.. హాట్ గురూ!!
X
కృష్నాజిల్లా కేంద్రం మచిలీపట్నం పురపాలక సంఘం ర‌ద్ద‌యి.. ఇప్పుడు మునిసిపల్‌ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. ఈ నేప‌థ్యంలో తాజాగా కార్పొరేషన్‌ హోదాలో ఈ నెల 10 న ఎన్నికలు జరుగుతున్నాయి. మంత్రి పేర్నినాని సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ వైసీపీని గెలిపించి.. త‌న మంత్రి ప‌ద‌విని నిల‌బెట్టుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తం ఇక్క‌డ 50 డివిజ‌న్లు ఉన్నాయి. వీటిలో సగం సీట్లు మహిళలకు కేటాయించాల్సి రావడంతో 25 డివిజన్లలో మహిళా అభ్యర్థులు కార్పొరేటర్లుగా పోటీలో ఉన్నారు. ఇక‌, బంద‌రులో పాగా వేసేందుకు వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది.

మంత్రి పేర్నినాని వ్యూహాత్మంగా పావులు క‌దుపుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు ప‌రుగులు పెట్టి మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా దూకుడుగానే ఉంది. మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌కు ఈ కార్పొరేష‌న్‌లో పాగా వేయ‌డం అత్యంత అవ‌స‌రం. అయితే.. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం.. వైసీపీ నేత‌ల నుంచి బెదిరింపులు.. ప్ర‌లోబాల ప‌ర్వంతో నాయ‌కులు ప్ర‌చారానికే వెనుకాడుతున్న ప‌రిస్థితి ఉంది. దీంతో చాలా డివిజ‌న్ల‌లో జెండా క‌ట్టేవారు.. మోసేవారు కూడా క‌రువ‌య్యారు. ఇక‌, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మచిలీపట్నం మండలంలో రెండు పంచాయతీలను జనసేన తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు పంచాయతీల్లోనూ టీడీపీ జనసేన కలసి పోటీ చేయడంతో ఈ విజయం సాధ్యమైంది.

ఈ నేప‌థ్యంలో మచిలీపట్నంలోని కొన్ని డివిజన్లలో టీడీపీ, జనసేన కలయికతోనే ఎన్నికలకు వెళ్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మచిలీపట్నం కార్పొరేషన్‌లో ఎన్ని డివిజన్లలో జనసేన అభ్యర్థులు గెలుపొందుతారు, ఈ ప్రభావం వైసీపీ, టీడీపీపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఎవ‌రికి వారుగానే ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీలోపాయికారీగా మాత్రం ఇరు పార్టీల మ‌ద్య అవ‌గాహ‌న ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బంద‌రు మేయర్‌ పదవిని జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. స్థానికంగా నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా తొలి మేయర్‌ పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఎలా చూసుకున్నా.. మ‌చిలీ ప‌ట్నంలో ఇటు మంత్రి పేర్నికి.. అటు మాజీ మంత్రి కొల్లుకు పెను స‌వాలుగా మార‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.