Begin typing your search above and press return to search.

ముంబై ఆసుపత్రికి మంత్రి విశ్వరూప్!

By:  Tupaki Desk   |   23 Sept 2022 6:28 PM IST
ముంబై ఆసుపత్రికి మంత్రి విశ్వరూప్!
X
వైసీపీ మంత్రి విశ్వరూప్ ని ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అక్కడ ప్రముఖ ఆసుపత్రిలో వైద్య చికిత్సను అందిస్తున్నారు. విశ్వరూప్ ఇటీవల కాలంలో అనారోగ్యం బారిన పడడం ఇది రెండవసారి. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లుగా గుర్తించిన మీదటనే కుటుంబసభ్యులు ముంబై ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.

ఆయన ఈ మధ్య వైఎస్సార్ వర్ధంతి వేళ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనారోగ్యం పాలు అయ్యారు. ఆ రోజున ఆయన్ని వెంటనే రాజమండ్రీలోని ఒక ఆసుపత్రిలో వైద్యం అందించి అనంతరం హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. కోలుకున్న మీదట ఆయన డిశ్చార్జి అయి తన విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఇపుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడింది అని అంటున్నారు.

ఇదిలా ఉండగా విశ్వరూప్ న్యూరో సమస్యతో బాధపడుతున్నట్లుగా అప్పట్లో వైద్యులు గుర్తించారు. అదే సమయంలో ఆయనకు హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఆయనకు మెరుగైన వైద్యం కోసమే ముంబైకి తరలించారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా విశ్వరూప్ గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గి వైఎస్సార్ క్యాబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు.

తూర్పుగోదావరి జిల్లా నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన విశ్వరూప్ కి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. విస్తరణలో సైతం ఆయననే జగన్ కంటిన్యూ చేశారు. ప్రస్తుతం రవాణా శాఖ నిర్వహిస్తున్న విశ్వరూప్ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు పెట్టవద్దంటూ కొంతమంది చేసిన నిరసన శృతి మించి అమలాపురంలో విశ్వరూప్ ఇంటిని ఆ మధ్యన ఆందోళనకారులు నిప్పటించారు. ఆ ఘటన మీద ఆయన కలత చెందారు కూడా.

ఇక విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితి మీద అప్పట్లోనే జగన్ పరామర్శించి తగిన సూచనలు చేశారు. అయితే విశ్రాంతి అవసరం అని ఇపుడు తెలుస్తోంది. మరి ఆయన ముంబై ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారా అన్న చర్చ కూడా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.