Begin typing your search above and press return to search.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి నిలువుదోపిడీ ఇచ్చిన తెలంగాణ మంత్రి?

By:  Tupaki Desk   |   2 Jan 2022 10:29 PM IST
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి నిలువుదోపిడీ ఇచ్చిన తెలంగాణ మంత్రి?
X
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం ఉదయం తెలంగాణకు చెందిన మహిళా మంత్రి దర్శించుకున్నారు. అయితే మంత్రిగారు దేవుడికి కానుకగా ఆమె ఒంటిమీద ఉన్న మొత్తం బంగారం ఇచ్చేశారు.

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ యాదాద్రి ప్రధానాలయ బంగారం తాపడానికి తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. రెండు చేతి గాజులు, రింగులు, మెడ గొలుసును లక్ష్మీ నరసింహస్వామికి నిలువుదోపిడీ ఇచ్చారు. మొత్తం స్వామి వారికి 12 తులాల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ తాను కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడిపండలతో సుభిక్షంగా ఉండాలని తాను నరసింహ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తామని.. ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు కేసీఆర్ తన ఫ్యామిలీ తరుఫున కిలో 16 తులాల బంగారం విరాళం ఇచ్చారు. సీఎం పిలుపుతో చాలా మంది ప్రముఖులు కిలోల కొద్దీ బంగారాన్ని లక్ష్మీనరసింహ స్వామికి విరాళం ఇచ్చారు.