Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకే దొంగలు ఝలక్ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   21 April 2022 9:29 AM GMT
ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకే దొంగలు ఝలక్ ఇచ్చారే!
X
ఆమె ఏపీ మంత్రి.. పైగా ఫైర్ బ్రాండ్ నేత. ఆమె నోరు విప్పితే ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు హడలిపోతారు. అంతటి యాక్టివ్ గా ఉండే రోజా సెల్ ఫోన్ నే దొంగలు చాకచక్యంగా కొట్టేయడం చర్చనీయాంశమైంది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి హోదాలో శాప్ పై మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాప్ సమావేశంలో రోజా తన సెల్ ఫోన్ కనిపించకపోవడంతో ఆరా తీసింది. ఆమె సెల్ ఫోన్ చోరీకి గురైందని తెలుసుకొని షాక్ కు గురైంది.

కాగా మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీకి గురికావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. దొంగను గుర్తించేందుకు మూడు బృందాలు గాలింపులు చేపట్టాయి. మంత్రి ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరకు దొంగను కనుక్కున్నారు. వెంటనే అతడిని పట్టుకొని మంత్రి రోజా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా ఎస్వీ యూనివర్సిటీలో తన ఫోన్ పొగొట్టుకున్నట్టు గుర్తించారు. పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద ఫోన్ చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో ఓ దొంగ సెల్ ఫోన్ ను చోరీ చేసినట్టు గుర్తించారు.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగ రుయా ఆస్పత్రి వద్ద ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి దొంగను పట్టుకొని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రోజాకు ఆమె సెల్ ఫోన్ ను అప్పగించారు. 165 నిమిషాల అనంతరం సెల్ ఫోన్ దొరికింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఏకంగా మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. ‘గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ ను ముందుకు తీసుకెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచన’గా ఉందని రోజా అన్నారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో యువతీ యువకులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పోర్ట్స్ ఆడడం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని మంత్రి రోజా అన్నారు. ఫైర్ అనేది పుట్టుకతోనే వస్తుందని.. చెడు మీద ఫైర్ అలాగే కొనసాగుతుందని రోజా స్పష్టం చేశారు. తానెప్పుడూ సీఎం జగన్ ను ఫాలో అవుతానన్నారు.