Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే కేక్ కోసిన మంత్రి.. సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం!

By:  Tupaki Desk   |   21 April 2020 8:45 AM IST
బ‌ర్త్ డే కేక్ కోసిన మంత్రి.. సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం!
X
క‌రోనా క‌ట్ట‌డి కోసం సామూహిక కార్య‌క్ర‌మాలపై నిషేధం విధించారు. ప్ర‌జ‌లంతా దూరం దూరంగా ఉండాల‌ని అధికార యంత్రాంగం సూచ‌న‌లు చేస్తోంది. అయితే ఈ విష‌యాన్ని ఏకంగా మంత్రి ఉల్లంఘించ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లాక్‌డౌన్ వేళ‌.. వేడుక‌లు ర‌ద్దు చేసుకుంటున్న స‌మ‌యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకోవ‌డంపై మండిప‌డ్డారు. ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజ‌య్ కుమార్ జ‌న్మ‌దినం సోమ‌వారం. ఈ సంద‌ర్భంగా ఆ మంత్రికి చెందిన శాఖ సిబ్బంది సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చారు.

కేక్ తీసుకొచ్చి మంత్రిని కట్ చేయాల‌ని కోరారు. అయితే ఆ కేక్ కరోనా వైరస్ ఆకారం లో రూపొందించారు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్‌ను చీల్చి చెండాడేలా ఉండేలా మంత్రి కేక్ క‌ట్ చేయించారు. క‌రోనా వైర‌స్‌ను మంత్రి చీల్చి చెండాడుతున్నట్టు పెద్ద కత్తిని ఆయన చేతికి అందించారు. ఈ క్ర‌మంలో మంత్రి కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకోవ‌డాన్ని ప్ర‌జ‌ల‌తో పాటు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక బాధ్య‌తాయుతంగా ఉండాల్సిన మంత్రి ఇలా సంబ‌రాలు చేసుకోవ‌డం స‌రికాద‌ని చెబుతున్నారు.

లాక్‌డౌన్ వేళ‌.. క‌రోనా వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో మంత్రి పుట్టినరోజు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉందా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యం చివరకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద‌కు చేరింది. వెంట‌నే మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారని స‌మాచారం. అయితే సీఎంకు మంత్రి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే అలాంటి కేక్ కట్ చేశామని, పుట్టినరోజు సంబ‌రాలు కాద‌ని కేసీఆర్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ విధంగా మంత్రి త‌న జ‌న్మ‌దినాన మంచిబోయి ఇరుకున ప‌డడం గ‌మ‌నార్హం.