Begin typing your search above and press return to search.

మామిళ్లపల్లె ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన..

By:  Tupaki Desk   |   9 May 2021 10:30 AM GMT
మామిళ్లపల్లె ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన..
X
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె ఘటనపై ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పేలుళ్ల ఘటనలో పది మంది మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోసం ఐదు ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ సేఫ్టీ, ఎక్స్ప్లోజివ్స్ అధికారులు దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఐదు రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించామని మంత్రి స్పష్టం చేశారు. అన్లోడింగ్ నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనపై ఒక్కో అధికారి ఒక్కో తీరుగా సమాధానం చెబుతుండడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో లీజుకు అనుమతులు లేవని గనుల విభాగం చెబుతోంది. బ్లాస్టింగ్ అనుమతులు ఉన్నట్లు పోలీసులు చెప్పడం గమనార్హం. ఇంకా పేలుడు పదార్థాల రవాణాపై స్పష్టమైన సమాచారం లేదు. పేలుడు పదార్థాల రవాణా సమయంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని స్థానికులు అంటున్నారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను నిర్భయంగా కారులో తరలించినట్లు చెబుతున్నారు.

పేలుడు పదార్థాలను ప్రత్యేక వాహనంలో, పత్యేక వాతావరణ పరిస్థితుల మధ్య తరలించాల్సి ఉంటుంది. కారులో పేలుడు పదార్థాలు తరలిస్తుండగా మామిళపల్లెలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.