Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి శం​కు​స్థాప‌న రేంజ్ ఇది

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:13 PM GMT
అమ‌రావ‌తి శం​కు​స్థాప‌న రేంజ్ ఇది
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ లేటెస్ట్ అప్‌డేట్స్‌ తో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం వ‌స్తోంది. శంఖుస్థాపన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికే దాదాపు అంద‌రికీ ఆహ్వానాలు పంపారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌దిత‌రులకు వ్య‌క్తిగ‌తంగా అంద‌జేశారు. ఈ క్ర‌మంలో చంద్రబాబు తాజాగా రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు - సీఆర్‌డీఏ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాకు ఆ వివరాలను తెలిపారు.

ఈనెల 13 నుంచి 21 వరకు జిల్లా కేంద్రాల్లో అమరావతి విశిష్టత తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయ‌ణ‌ వివరించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ విశేషాలు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశంలో అమరావతి లోగో - శంఖుస్థాపన రోజున నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు - అమరావతి సంకల్ప జ్యోతి, మన మట్టి-మన నీరు గురించి ప్రధానంగా చర్చించినట్లు వివ‌రించారు. అక్టోబర్‌ 13న అన్ని గ్రామాల్లో సంకల్ప జ్యోతి ప్రారంభమై...22న శంకుస్థాపన స్థలికి చేరుకుంటాయన్నారు. అక్టోబర్‌ 15న 16,000 గ్రామాల నుంచి కిలో మట్టి , లీటర్‌ నీటిని కలశాల్లో రాజధానికి తీసుకొస్తారని పేర్కొన్నారు. గ్రామాలనుంచి తీసుకుని వచ్చిన మట్టి, నీరు 18 నాటికి గుంటూరు చేరుకుంటుందని తెలిపారు. అక్టోబర్‌ 20న గుంటూరులో జరిగే సంకల్ప జ్యోతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. అమరావతి సంకల్ప జ్యోతిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

శంఖుస్థాప‌న కార్య‌క్ర‌మం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల వార‌స‌త్వానికి, గౌర‌వానికి ప్ర‌తీక అయినందున ప్ర‌తి ఒక్క‌రూ ఇందులో త‌మ వంతు ప్రాత్ర పోషించాల‌ని మంత్రి కోరారు. ఇదే క్ర‌మంలో దేశ‌విదేశాల నుంచి వ‌చ్చే విశిష్ట అతిథులకు మాస్ట‌ర్‌ ప్లాన్‌, సీఆర్‌డీఏ విశిష్ట‌త‌లు, అమ‌రావ‌తి ప్ర‌త్యేక‌త‌లు వివ‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.