Begin typing your search above and press return to search.

చిన‌బాబు ఇమేజ్ బిల్డింగ్ అదిరిందిగా!

By:  Tupaki Desk   |   24 Jan 2019 4:41 AM GMT
చిన‌బాబు ఇమేజ్ బిల్డింగ్ అదిరిందిగా!
X
ఏమైనా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్లానింగే ప్లానింగ్‌. ఏపీకి కంపెనీలు పోటెత్త‌టం సంగ‌తి ఎలా ఉన్నా.. ఇంకేముంది.. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చేస్తున్నాయ్.. భారీగా పెట్టుబ‌డులు క్యూ క‌డుతున్నాయ‌న్న ఇమేజ్ ను తీసుకురావ‌టంలో బాబుకున్న నేర్పు దేశంలో మ‌రే ముఖ్య‌మంత్రికి లేద‌ని చెప్పాలి. మ‌రి కొద్ది నెలల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. తాను.. త‌న కొడుకు క‌లిసి ఏపీని ఏదేదో చేస్తున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టంలో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారు. అంతేనా.. త‌నను విప‌రీతంగా అభిమానిస్తూ.. ఆరాధించే మీడియాల‌లో వార్త‌ల్ని వండించే వైనం చూస్తే... అవాక్కు అవ్వాల్సిందే.

భారీ బిల్డ‌ప్ లు ఇవ్వ‌టంలో బాబు బ్యాచ్ త‌ర్వాతే ఎవ‌రైనా అన్నది ఒప్పుకొని తీరాల్సిందే. ప్ర‌తి ఏటా దావోస్ లో జ‌రిగే స‌మావేశాల‌కు బాబు వెళ్ల‌టం తెలిసిందే. ఈసారి త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ బాబును పంపారు. అదే సిత్ర‌మో కానీ.. దేశానికి చెందిన పారిశ్రామివేత్త‌లు దేశంలో క‌ల‌వ‌కుండా అక్క‌డెక్క‌డో దావోస్ లో భేటీ కావ‌టం ఒక ఎత్తు అయితే.. భారీ పెట్టుబ‌డుల‌కు స‌ద‌రు సంస్థ‌లు రెఢీ అయిపోయిన‌ట్లు.. కుప్ప‌లు తెప్ప‌లుగా ప్రాజెక్టుల‌కు ఓకే చేసేసి.. తాము ఏపీకి వ‌స్తున్న‌ట్లుగా చెప్పేయ‌టంలో బాబు బ్యాచ్ ఎంత ప్ర‌చారం చేసుకుంటుందో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఏపీలోకి జిందాల్ గ్రూప్ రూ.3500 కోట్ల భారీ పెట్టుబ‌డికి సిద్ధ‌మైంద‌ని.. ప్ర‌కాశం జిల్లాలోని రామాయ‌ప‌ట్నం రేవులో జెట్టి నిర్మాణంతో పాటు.. బొగ్గు.. ముడి ఇనుమును త‌ర‌లించేందుకు వీలుగా ఒక స్ల‌ర్రీ పైపులైనును కూడా నిర్మిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. జెట్టికి వెయ్యి కోట్ల రూపాయిలు.. స్ల‌ర్రీ పైపులైను నిర్మాణానికి రూ.2500 కోట్లు పెట్టుబ‌డిగా పెట్ట‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

ఇంత‌వ‌ర‌కూ ఏమో అనుకుంటే.. దీనికి అద‌నంగా ప్ర‌కాశం జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను పెట్టేయ‌టానికి జిందాల్ ప్ర‌క‌టించిన‌ట్లుగా చెబుతున్నారు. జిందాల్ సీఈవో స‌జ్జ‌న్ జిందాల్ తో భేటీ అయిన లోకేశ్‌..రూ.3500 కోట్ల పెట్టుబ‌డుల‌తో పాటు.. ఎల‌క్ట్రిక‌ల్ కార్ల ప‌రిశ్ర‌మ‌ను కూడా పెట్టాల‌ని కోర‌టం.. ఆ వెంట‌నే జిందాల్ ఓకే చెప్పేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఉక్కు రంగంలో జిందాల్ కు పేరుంది కానీ.. ఎల‌క్ట్రిక‌ల్ కార్ల ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి విన్న‌ది లేదు. కానీ.. లోకేశ్ బాబు అడిగేయ‌టం.. ఆ వెంట‌నే జిందాల్ ఓకే చెప్పేసిన‌ట్లుగా ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల వార్త‌ల్లో వ‌చ్చిన తీరు ఆస‌క్తిక‌రంగా మారింది.

చిన‌బాబు ఇమేజ్ బిల్డింగ్ ఇక్క‌డితో ఆగ‌లేదు. జిందాల్ తో మొద‌లైన ఆయ‌న మొన‌గాడిత‌నాన్ని ఆకాశానికి ఎత్తేసే రీతిలో మ‌రిన్ని భేటీల స‌మాచారాన్ని ప్ర‌క‌ట‌న రూపంలో మీడియా సంస్థ‌ల‌కు చేరేశారు. త‌న కోర్ టీం త‌న‌తో ఎప్పుడు మాట్లాడినా ఏపీ గురించి చెప్పే వార‌ని జిందాల్ చెప్పారు. రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి గురించి అదే ప‌నిగా చెబుతున్న మాట‌ల నేప‌థ్యంలో.. తాను త్వ‌ర‌లోనే ఏపీలో ప‌ర్య‌టిస్తాన‌ని జిందాల్ వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం.

జిందాల్ తో పాటు.. పెగా సిస్ట‌మ్స్ సీఈవో అల‌న్ ట్రెఫ్ల‌ర్.. మార్ష్ అండ్ మేక్లీన‌న్ కంపెనీ ఛైర్మ‌న్ అలెగ్జాండ‌ర్ ఎస్ మాక్జర్స్కినీ.. నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క‌మ్ సీఈవో క్రిష్ జాన్స‌న్.. త‌దిత‌రుల‌ను క‌లిసిన‌ట్లుగా.. వారు ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇంత‌కూ లోకేశ్ బాబు దావోస్ ఎందుకు వెళ్లిన‌ట్లు అంటే.. టెక్నాల‌జీస్ ఫ‌ర్ టుమారో అన్న టాపిక్ పైన మాట్లాడేందుకు. ఆ సంద‌ర్భంగా లోకేశ్ బాబాయ్ ని చూడ‌గానే ప‌లు కంపెనీలు ఏపీకి వ‌చ్చేయ‌టానికి ఆస‌క్తిని చూపాయి. మ‌రి.. అలాంటిదేదో.. లోకేశ్ ఏపీలో ఉండ‌గా ఎందుకు రాన‌ట్లు చెప్మా..?