Begin typing your search above and press return to search.

ఏపీ ఆర్టీసీ అమానుషంపై మంత్రి నాని సీరియస్.. సారీ చెప్పి చెంపలేసుకున్న సిబ్బంది

By:  Tupaki Desk   |   24 Feb 2021 5:00 PM IST
ఏపీ ఆర్టీసీ అమానుషంపై మంత్రి నాని సీరియస్.. సారీ చెప్పి చెంపలేసుకున్న సిబ్బంది
X
రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమాచార గోడ ఒకటి భారీగా కట్టేశారు. తెలంగాణలో తెలంగాణ వార్తలు.. అడపదడపా ఆంధ్రా వార్తలే తప్పించి.. మనసును కదిలించేవి.. దారుణ ఘటనల గురించి కవరేజ్ బాగా తగ్గించేశారు. తెలుగు మాట్లాడే ప్రజలకు తమ పక్కనున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. న్యూస్ పేపర్లతో పోలిస్తే.. టీవీ చానళ్ల పుణ్యమా అని.. కాస్తోకూస్తో విషయాలు తెలిసే పరిస్థితి.

విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో ఒక అమానుష ఘటన జరిగింది. సాలూరుకు చెందినపోలమ్మ.. తన భర్త 58 ఏళ్ల పైడయ్యకు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం కోసం పార్వతీపురం తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. తిరిగి వస్తున్న వేళలో.. బస్సులోనే ప్రాణాలు విడిచారు. బస్సు సిబ్బందితో పాటు ప్రయాణికులు.. ఆమె దారి మధ్యలోనే బస్సును ఆపేసి.. దింపేశారు. పెద్ద వయస్కురాలుకావటం.. నిస్సహాయంగా ఉండటంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయారు. కట్టుకున్న భర్త కనిపించని లోకాలకు వెళ్లిన పుట్టెడుశోకంలో ఉన్న వేళ.. చుట్టూ ఉన్న వారు మానవత్వం మరిచి..అమానుషంగా వ్యవహరిస్తూ.. ఆమెను.. డెడ్ బాడీని డ్రైనేజీ పక్కనే వదిలేసి వెళ్లిపోయారు.

దారి వెంట వెళుతున్న వారిని ఆర్థించిన ఆమె గోడు మీడియాకు తెలీటం.. వారు స్పందించి.. మిగిలిన వారికి సమాచారాన్ని చేరవేయటంతో స్పందించిన పలువురి పుణ్యమా అని ఆమెను స్వగ్రా మానికి పంపే ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతంపై ఆర్టీసీ మీదా.. దాని సిబ్బంది మీదా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు తిట్టిపోశారు. ఈ ఉదంతంపై మీడియాలో ప్రముఖంగా రావటంతో విషయం మంత్రి పేర్ని నాని వద్దకు వెళ్లింది.

విషయంలో తెలిసి సీరియస్ అయిన ఆయన ఎండీని.. వీసీలను పిలిచి తలంటారు. ఆ వెంటనే వారు ఈ ఉదంతం గురించి ఆరా తీసి.. సంబంధిత ఉన్నతాధికారుల్ని వృద్ధురాలి ఇంటికి పంపారు. క్షమించాలని కోరుతూ..చెంపలేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికుల పట్ల ఆర్టీసీ సిబ్బంది మానవత్వంతో వ్యవహరించకపోతే చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు. ఇక్కడితో ఆగకుండా.. ఆమెకు మరేదైనా సాయం చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.