Begin typing your search above and press return to search.

మంత్రి మ‌ల్లారెడ్డి మా ల్యాప్ టాప్ చోరీ చేశారు: ఐటీ కంప్లెయింట్‌

By:  Tupaki Desk   |   25 Nov 2022 11:30 PM GMT
మంత్రి మ‌ల్లారెడ్డి మా ల్యాప్ టాప్ చోరీ చేశారు:  ఐటీ కంప్లెయింట్‌
X
తెలంగాణ‌లో మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన వ్య‌వ‌హారం అనేక కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా ఆదాయ పన్ను శాఖ అధికారులు.. త‌మ‌ ల్యాప్టాప్ను మ‌ల్లారెడ్డి చోరీ చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారి రత్నకుమార్‌ ల్యాప్‌టాప్‌ చోరీకి గురైందని.. మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు.

ఐటీ అధికారి రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదులో త‌మ ల్యాప్ టాప్‌ను చోరీ చేశార‌ని, దీనిలో విలువైన డాటా ఉంద‌ని, దానిని తొలగించారని ఆయ‌న పేర్కొన్నారు. దీంతో ఆగ‌మేఘాల‌పై పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు. అయినా, త‌మ‌కు అది చేర‌లేద‌ని ఐటీ అధికారులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అయితే, ల్యాప్ టాప్ త‌మ వ‌ద్దే ఉన్న‌ప్ప‌టికీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకెళ్లలేదని పోలీసులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం ఉందని ఐటీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, స్టేష‌న్‌కు వ‌చ్చి ప‌రిశీలించిన త‌ర్వాత‌ ఆ ల్యాప్‌టాప్‌ తనది కాదని ఐటీశాఖ అధికారి రత్నాకర్‌ చెప్పారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ బోయిన్‌పల్లి పోలీసుల వద్ద ఉంది.

అసలేం జరిగిదంటే
‘విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వెళ్లి సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేస్తుండగా.. మంత్రి తన అనుచరులతో వచ్చి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నా నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, వారంట్లను లాక్కున్నారు. వాటిని చించేసే ప్రయత్నం చేశారు. నా విధుల్ని అడ్డుకున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో పోలీసులు మల్లారెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 379 (చోరీ), 342 (బలవంతంగా నిర్బంధించడం), 353 (దాడి), 201 (నేర ఆధారాల్ని మాయం చేయడం), 203 (నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 రెడ్‌విత్‌ 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.