Begin typing your search above and press return to search.

ప‌రువుపోతే కానీ..ఉద్య‌మ‌కారులు గుర్తుకురారా కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   4 May 2018 3:28 PM GMT
ప‌రువుపోతే కానీ..ఉద్య‌మ‌కారులు గుర్తుకురారా కేటీఆర్‌?
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి - ముఖ్యంగా టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామం ఇది. ఇంకా చెప్పాలంటే టీఆర్ ఎస్ పార్టీకి కంక‌ణ‌బ‌ద్దులై ఉన్న నేత‌లు సైతం త‌మ నాయ‌కుల గురించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యం. ఇంత‌కీ ఏం జ‌రిగిదంటే...తెలంగాణ‌ ఉద్య‌మంలో టీఆర్ ఎస్ పార్టీకి మ‌ద్ద‌తుగా అనేక మంది త‌మ త‌మ ప‌రిధిలో ఉద్య‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌లువురిపై కేసులు న‌మోదు అయ్యాయి. అయితే స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వాటికి విముక్తి క‌లుగుతుంద‌ని ప‌లువురు భావించారు. కానీ ఫ‌లితం లేదు. తాజాగా టీఆర్ ఎస్ సానుభూతిప‌రుడైన ఓ వ్య‌క్తిపై కేసు న‌మోదు అవ‌డంతో ఆ పార్టీ సానుభూతి ప‌రులు భ‌గ్గుమ‌న్నారు.

ఇటు సోష‌ల్ మీడియాలో మ‌రోవైపు ఫోన్లు - వాట్సాప్‌ ల ద్వారా టీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌పై ఒత్తిడి పెంచారు. ఉద్య‌మంలో భాగంగా న‌మోదైన కేసులు ఎత్తివేసేందుకు ఎందుకీ జాప్య‌మంటూ ప్ర‌శ్నించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా..ఇదేం నిర్ల‌క్ష్య‌మంటూ విరుచుకుప‌డ్డారు. ఈ ప‌రిణామం పార్టీకి ఇబ్బందిగా మారుతోంద‌ని గుర్తించిన మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. తాను ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు. ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమవేశంలో హోంమంత్రి నాయిని స‌హా డీజీపీ మహేందర్ రెడ్డి - హోం సెక్రటరీ రాజీవ్ త్రివేది - న్యాయ శాఖ సెక్రటరీ నిరంజన్ రావు - ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ ఇప్పటికి కొన్ని కేసులు మాత్రమే వివిధ కారణాల చేత పెండింగ్‌ లో ఉన్నాయని మంత్రులకు తెలిపారు. ముఖ్యంగా కొన్ని కేసుల్లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగినది అని ప్రత్యేకంగా కేసు షీట్లో రాయకపోవడం వంటి సాంకేతిక కారణాలతో అతి తక్కువ కేసులు మాత్రమే పెండిగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వతా ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేసినం అని డీజీపీ మంత్రులకు తెలిపారు.

అనంత‌రం మంత్రులు మాట్లాడుతూ టెక్నికల్ కారణాల వల్ల - సమాచార లోపం వల్ల ఒకటీ అరా కేసులేమైనా మిగిలి ఉంటే వాటిని కూడా అతి త్వరలో ఎత్తివేయాలని మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీని కోరారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుండి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడికరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారి పర్యవేక్షించి సాద్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారులపైన ఉన్న కేసుల్లో మెజారిటీ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిందని... పెండింగులో ఉన్న కొద్దిపాటి కేసులు కూడా అతి త్వరలో ఎత్తివేస్తామని రాష్ట్ర మంత్రులు నాయిని, జగదీష్ రెడ్డి, కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారం అందించడానికి contact@trspartyonline.org లేదా వాట్సాప్ ద్వారా 8143726666 నెంబర్‌కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని మంత్రులు తెలిపారు. అయితే, కార్య‌క‌ర్త‌లు భ‌గ్గుమంటే కానీ అది కూడా నాలుగేళ్ల త‌ర్వాత కానీ కేసుల విష‌యం గుర్తుకురాలేదా అంటూ టీఆర్ఎస్ సానుభూతిప‌రులు ఆక్షేపిస్తున్నారు.