Begin typing your search above and press return to search.

కోవిడ్ వేళ.. టీచర్లను అందుకే ఆదుకోలేకపోయామన్న కేటీఆర్

By:  Tupaki Desk   |   10 March 2021 8:30 AM GMT
కోవిడ్ వేళ.. టీచర్లను అందుకే ఆదుకోలేకపోయామన్న కేటీఆర్
X
అంత చేశాం.. ఇంత చేశామని తరచూ చెప్పే అధికారపక్షం మాటలకు భిన్నమైన మాటల్ని చెప్పారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. నోరు తెరిస్తే చాలు.. తమ ప్రభుత్వం ఎంత చేసిందో గొప్పలు చెప్పే కేటీఆర్..అందుకు భిన్నంగా తాము చేయలేకపోయిన పని.. కష్టంలో ఉన్న వారిని ఆదుకోలేకపోయిన విషయాన్ని వెల్లడించిన వైనం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా సికింద్రాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును.. ప్రధాని మోడీ పాలనను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వేళలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగితే.. నాటి దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న మన్మోహన్ సింగ్ ను పదవి నుంచి తప్పుకోవాలన్నారు. మరి.. ఈ రోజున పెట్రోల్ ధర సెంచరీ దాటిందని.. దానికి మోడీ ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు.

దేశం దాటిన బ్లాక్ మనీని దేశానికి తిరిగి తీసుకొస్తామన్న మోడీ.. దేశానికి వాపసు తీసుకురాలేదన్నారు. ఒకవేళ.. బీజేపీనేతలకు చేరి ఉండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. కొవిడ్ కష్ట కాలంలో అధ్యాపకులు.. అధ్యాపకేతర సిబ్బంది పడిన కష్టాలు తమకు తెలుసన్నారు. కానీ.. వారిని తాము ఆదుకోలేకపోయిన విషయాన్ని వెల్లడించారు. అధ్యాపకులు.. అధ్యాపకేతర సిబ్బంది 12 లక్షల మంది ఉన్నారు. వారందరిని ఆదుకోవటం సాధ్యం కాలేదన్న మాటను చెప్పేశారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.52వేల కోట్ల మేర రాబడిలో నష్టం వాటిల్లిందని.. అందుకే తాము ఏమీ చేయలేకపోయినట్లుగా ఆయన పేర్కొన్నారు. అన్ని చేశామనే బడాయి మాటల స్థానే.. కొన్ని చేయలేకపోయామనే మాటలు మంత్రి కేటీఆర్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.