Begin typing your search above and press return to search.

మోడీ నోట ఏ మాట వచ్చినా తప్పేనా?

By:  Tupaki Desk   |   8 Jun 2022 4:28 AM GMT
మోడీ నోట ఏ మాట వచ్చినా తప్పేనా?
X
దాదాపు ఏడేళ్లకు పైగా సాగిన రహస్య స్నేహం.. ఈ మధ్య దెబ్బ తినటమే కాదు.. దారుణంగా మారిందన్న మాట వినిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్లే.. బీజేపీపైనా.. దాని అధినాయకత్వం మీదా అదే పనిగా విరుచుకుపడటం గులాబీ చిన్న బాస్ కు ఒక అలవాటుగా మారింది. పేరుకు మంత్రే అయినా.. తన తండ్రి పరోక్షంలో డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న ఆయన.. ఈ మధ్య కాలంలో అదే పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేయటం.. డైలీ బేసిస్ లో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఏదైనా పరిణామం చోటు చేసుకున్నంతనే లెక్కల చెబుతూ విరుచుకుపడుతున్నారు. తాజాగా అలాంటి పనే మరోసారి చేశారు.

ఈ మధ్యన హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్ మహానగర కార్పొరేటర్లలో కొందరిని కలవలేదు. దీంతో.. వారంతా నిరాశకు గురయ్యారు. దీంతో.. ఈ విషయాన్ని మోడీ వరకు తీసుకెళ్లటం.. ఒక రోజు చూసుకొని అందరిని కలుస్తానని మాట ఇచ్చారు.

దీనికి తగ్గట్లే.. పది రోజులు గడిచేసరికి కమలం పార్టీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి కబురు వచ్చేసింది. మంగళవారం సాయంత్రం వారు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. దాదాపు గంటకు పైనే సమయాన్ని వీరి కోసం వెచ్చించిన ప్రధాని.. కొద్దిసేపు కొందరు కార్పొరేటర్లతో మాట్లాడటం.. కొన్ని ప్రశ్నల్ని అడిగి.. వారి నుంచి సమాధానం వినటం లాంటివి చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ నోటినుంచి వచ్చిన మాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని కేటీఆర్ తప్పు పట్టారు.

''ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా?'' అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వరద సాయం అందలేదని.. మెట్రో విస్తరణ.. మూసీ పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించే ఆలోచనలు చేస్తున్నారా? ఐటీఐఆర్ పై ఏమైనా పురోగతి ఉందా?'' అని ప్రశ్నించారు.

నిధులు గుజరాత్ కు.. మాటలు మాత్రం హైదరాబాద్ కు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ శతాబ్దిలోనే హైదరాబాద్ మహానగరం భారీ వరదల్ని ఎదుర్కొన్నా.. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూపాయి కూడా రాలేదు' అని ఫైర్ అయ్యారు. మొత్తంగా చూస్తే.. ఏదోలా ప్రధాని మోడీని.. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టటమే పనిగామంత్రి కేటీఆర్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చూస్తుంటే.. రామ అన్నా.. బూతు మాటలా మారే అవకాశం ఉందని చెప్పక తప్పదు.