Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

By:  Tupaki Desk   |   28 Dec 2021 8:32 AM GMT
ఏపీ బీజేపీపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
X
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కొడాలి నాని స్పెషల్. తనదైన సూటిపోటి మాటలతో ప్రత్యర్థులకు హడలెత్తిస్తుంటారు. వివాదాస్పద కామెంట్లతో నిత్యం మీడియాలో నానుతూ ఉండే ఈ మంత్రి తాజాగా మరో ఆసక్తికర కామెంట్లు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో తెలియంది కాదు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రజాగ్రహ సభ నిర్వహిస్తోంది. అయితే ఈ సభ ప్రభావం అధికార పార్టీపై పడుతుందా..? అని కొందరు మంత్రి కొడాలి నానిని అడిగారు. దీంతో ఆయన ఓ ఛాలెంజింగ్ ఆన్సర్ చేశారు. అలా చేస్తే బీజేపీ గొప్ప పార్టీ అని అంటానని చెప్పారు. ఇంతకీ కొడాలి నాని ఎలాంటి కామెంట్లు చేశారు..?

ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే నేపథ్యంలో ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభ నిర్వహిస్తోంది.అయితే మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కొందరు ప్రజాగ్రహ సభ గురించి ప్రస్తావించారు. దీనిపై మట్లాడాలని కోరారు. దీంతో మంత్రి నాని మాట్లాడుతూ ‘వచ్చే ఎన్నికల్లో బీజేపీ 10 నుంచి 20 శాతం డిపాజిట్లు తెచ్చుకుంటే ఆ పార్టీ గొప్పదని అంటా..ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అంటున్నారే తప్ప ప్రజల్లో అలాంటి ఆలోచన లేదు’ అని అన్నారు. అయితే మంత్రి ఆ పార్టీని కేవలం డిపాజిట్లు తెచ్చుకుంటే చాలని అన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే వాస్తవం బయటపడుతోంది.

గత ఎన్నికల్లో బీజేపీకి చాలా చోట్ల డిపాజిట్లు రాలేదు. పరువుపోతుందన్న భయంతోనే దొరికిన వారికి భీం ఫాంలు ఇచ్చేశారు. ఒక్క సీటు కూడా గెలవకపోగా చాలా చోట్ల డిపాజిట్లు దక్కలేదు. దీంతో మంత్రి వచ్చే ఎన్నికల్లో 10 నుంచి 20 శాతం తెచ్చుకోవాలన్నారు. అంటే 175 సీట్లలో 10 శాతం అంటే 35 స్థానాల్లో కేవలం డిపాజిట్లు తెచ్చుకుంటా చాలని సవాల్ విసిరారు. అయితే గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీజేపీలో ఎలాంటి మార్పు రాలేదు. ఏవో జనసేనతో కలిసి అడపా దడపా పోరాటాలు చేయడమే తప్ప ఒక్కటీ సరైన విధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టలేదని అంటున్నారు.

పైగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లే కనిపించినా నేరుగా విమర్శించడానికి ఆ పార్టీ నాయకులు సాహసించరు. దీంతో ఆ పార్టీ వైపు వెళ్లడానికి ఎవరూ ఇష్డపడడం లేదు. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి తిరుపతిలో పర్యటించిన సందర్భంగా పార్టీ పరిస్థితి ఇలా ఉంటే కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల వరకు మార్పు రావాలని సూచించారు.

ఓ వైపు ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి తెలుగుదేశం, జనసేనలు దూసుకుపోతుంటే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా చెప్పే వరకు కూడా అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నాయకులు రాలేదు. దీంతో వారిపై ఎలా నమ్మకం కలుగుతుంది..? అనే వాదన పుట్టుకొస్తుంది. అయితే తాజాగా మంత్రి విసిరిన సవాల్ ను బీజేపీ నాయకులు స్వీకరిస్తారా..?అని చర్చించుకుంటున్నారు. ఇకనైనా పార్టీ పరిస్థితిలో మారకపోతే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి మార్పు కనిపించే అవకాశం ఉండదని అంటున్నారు.