Begin typing your search above and press return to search.

గోవాలో క్యాసినో ఏందీ.. బీజేపీ, చంద్రబాబుపై కొడాలి నాని మళ్లీ ఫైర్

By:  Tupaki Desk   |   25 Jan 2022 2:36 PM GMT
గోవాలో క్యాసినో ఏందీ.. బీజేపీ, చంద్రబాబుపై కొడాలి నాని మళ్లీ ఫైర్
X
ఏపీ మంత్రి కొడాలి నాని ఇలాకా గుడివాడలో క్యాసినోపై మాటల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలంతా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. తాజాగా ఈరోజు ‘చలో గుడివాడ’ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సహా బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వారు గోవా కల్చర్ ను గుడివాడకు తీసుకువచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.

బీజేపీ నేతలకు మంత్రి కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని కొడాలి నాని గుర్తు చేశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని వివరించారు. గోవాలో ఎందుకు కాసినోలను నిషేధించలేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా వచ్చి సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని కొడాలి నాని సవాల్ చేశారు. గుండాటను చూసి కాసినో అని చెప్పి టీడీపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు. టీడీపీ, బీజేపీ నేతలు గవర్నర్ ను కలిస్తే తనకేం ఇబ్బంది లేదన్నారు. రాష్ట్రపతిని కలిసినా అభ్యంతరం లేదన్నారు.

గతంలో చంద్రబాబు వల్ల ఇబ్బంది పడిన వాళ్లంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని.. వాళ్లతో కేసులు పెట్టించి బడితపూజ చేయడం ఖాయమని నాని హెచ్చరించారు. ఏ పార్టీ నేత అయినా సరే.. తనపై విమర్శలు చేస్తే గంటలోపే తగిన సమాధానం చెబుతానని తేల్చిచెప్పారు.

కాసినోతో తనకు సంబంధం లేదు కాబట్టే.. తాను పెట్రోల్ పోసుకొని చనిపోతానని చెప్పానని కొడాలి గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న టీడీపీ ఆఫీసులో పేకాట ఆడిన చరిత్ర చంద్రబాబుది అని తీవ్రంగా ఆరోపించారు. గతంలో చంద్రబాబును ఎన్టీఆర్ చెప్పుదెబ్బ కొట్టారంటూ.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే తనకు చెప్పారన్నారు. అలాంటి నేతలు తన గురించి ఆరోపణలు చేస్తే తగిన విధంగా సమాధానం చెప్పడానికి సిద్ధమని తేల్చిచెప్పారు.

టీడీపీ నేతల ఉచ్చు నుంచి బయటపడితేనే రాజకీయంగా సోము వీర్రాజు.. బీజేపీకి మంచిదని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఇమేజ్ గురించి మంత్రి కొడాలి నాని కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ బలహీనం అని నాని అనడం చర్చనీయాంశమైంది.